కల్తీ మద్యం తయారీదారులకు మరణశిక్ష: యూపీ ప్రభుత్వ సంచలన నిర్ణయం
కల్తీ మద్యం తయారీతో పాటు అక్రమ మద్యం మార్కెటింగ్ వ్యవస్థను నియంత్రించేందుకు ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా మరిన్ని కఠినచర్యలకు శ్రీకారం చుట్టింది. ఈ సందర్బంగా యూపీ ఎక్సైజ్ చట్టం-1910లో చేసిన కొన్ని మార్పులకు ప్రభుత్వం బుధవారం ఆమోదం తెలిపింది. దీని ప్రకారం కల్తీ మద్యం తాగి ఎవరైనా ప్రాణాలు కోల్పోతే ఆ మద్యం తయారీదారు లేదా సరఫరాదారులకు గరిష్ఠంగా మరణశిక్ష విధించేలా కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. కల్తీ మద్యం కారణంగా మరణం సంభవిస్తే దానికి కారణం అయిన దోషులకు జీవితఖైదుతో పాటు రూ.10లక్షల జరిమానా లేదా మరణశిక్ష విధించనున్నారు.
‘1910 ఎక్సైజ్ చట్టం ద్వారా ప్రస్తుతం జనాల ప్రాణాలతో ఆడుకుంటున్న కొందరు నేరస్థులకు సరైన శిక్ష విధించలేకపోతున్నాం. అందువల్లే కల్తీ మద్యం ఉత్పత్తి, అక్రమ రవాణాను అరికట్టేందుకు పలు నిబంధనలను అమల్లోకి తెచ్చాం.’ అని యూపీ ప్రభుత్వం తెలియజేసింది.