రైల్వే శాఖ యోచన: రైలు టికెట్ బక్ చేసుకోవాలంటే ఆధార్ తప్పనిసరి..!
ఐఆర్‌సీటీసీ సైట్ లేదా యాప్‌లలో రైలు టికెట్లు బుక్ చేసుకుంటున్నారా?
ఐఆర్‌సీటీసీ సైట్ లేదా యాప్‌లలో రైలు టికెట్లు బుక్ చేసుకుంటున్నారా? అయితే మీ వద్ద ఆధార్ కార్డు తప్పనిసరిగా ఉండాల్సిందే..! ఈ మేరకు రైల్వే శాఖ కసరత్తు ప్రారంభించినట్లు నివేదికలు పేర్కొన్నాయి. ఇకపై టికెట్ కన్ఫర్మ్ చేసుకోవడానికి ఆధార్ నెంబర్‌ను ఇవ్వాల్సి వస్తుందని నివేదికల సారాంశం. ఇదే జరిగితే ఇకపై రైలు టికెట్ బుక్ చేసుకుంటున్న ప్రతిసారి ఆధార్ నెంబర్‌ను ఇవ్వాల్సి వస్తుంది.
ఇటీవల ముంబయిలో రైల్వే టికెట్ల రాకెట్ వెలుగులోకి వచ్చింది. దీనిపై విచారించేందుకు సెంటర్ ఫర్ ఇన్ఫర్మేషన్ రైల్వే సిస్టమ్(సీఆర్‌ఐఎస్) నుంచి కొందరు సీనియర్ అధికారులు సోమవారం ముంబయికి వచ్చి ఖాన్ అనే వ్యక్తిని అరెస్టు చేశారు. అతడి నుంచి దాదాపు రూ. 1.5కోట్ల విలువ గల 6000 ఈ-రైల్వే టికెట్లను స్వాధీనం చేసుకున్నారు. అతడిని విచారించిన అనంతరం సీఆర్ (సెంట్రల్ రైల్వే), ఐఆర్‌సీటీసీ సాంకేతిక నిపుణులు సంయుక్తంగా ఓ నివేదిక తయారుచేశారు. ఈ తరహా మోసాలకు ఆపాలంటే ప్రయాణికుల యూజర్ ఐడీలను వారి ఆధార్ కార్డులతో లింక్ చేయాలని నివేదికలో పేర్కొన్నారు. అంతేగాక.. 'బుక్ నౌ' బటన్ నొక్కగానే ప్రయాణికుల మొబైల్‌ఫోన్‌కు ఓటీపీ వచ్చేలా సాఫ్ట్ వేర్ మార్చాలని ప్రతిపాదించారు. ఈ సిఫార్సులను రైల్వేశాఖ ఉన్నతాధికారులు పరిశీలిస్తున్నారు. త్వరలోనే అధికారిక ప్రకటన విడుదల చేయనున్నారు.
కాగా.. ఐఆర్‌సీటీసీ తత్కాల్ టికెట్టు, రైలు టికెట్టుకు కొత్త సర్వీసును ప్రారంభించింది. ఈ కొత్త సర్వీసు ప్రకారం ఐఆర్‌సీటీసీ ఈవాలెట్ యూజర్స్ ఇప్పటి నుంచి రైలు టికెట్టును, తత్కాల్ కోటా టికెట్టును ఐఆర్‌సీటీసీ సైట్ లేదా యాప్ ద్వారా బుక్ చేసుకోవచ్చు.