నవ్‌జ్యోత్ సింగ్ సిద్ధూపై రూ.1000 కోట్ల నష్టపరిహారం దావాకు నోటీసులు పంపిన జీ న్యూస్ !
నవ్‌జ్యోత్ సింగ్ సిద్ధూపై రూ.1000 కోట్ల నష్టపరిహారం దావా
న్యూఢిల్లీ: మాజీ క్రికెటర్, ప్రస్తుత పంజాబ్ రాష్ట్ర మంత్రి నవ్‌జ్యోత్ సింగ్ సిద్ధూపై ప్రముఖ న్యూస్ మీడియా సంస్థ జీ న్యూస్ రూ.1,000 కోట్ల మొత్తానికి పరువు నష్టం దావా వేయనున్నట్టు లీగల్ నోటీసులు పంపించింది. జీ న్యూస్ సంస్థ ప్రతిష్టను దిగజార్చేలా నవ్‌జ్యోత్ సింగ్ సిద్ధూ చేసిన అవాస్తవ ఆరోపణలను ఆయన ఉపసంహరించుకోవడంతోపాటు సంస్థకు ఆయన బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసిన జీ న్యూస్ సంస్థ.. లేనిపక్షంలో సిద్ధూపై న్యాయపోరాటానికి సిద్ధం అని ఆ నోటీసుల్లో పేర్కొంది. నోటీసులు అందిన 24 గంటల్లోగా సిద్ధూ క్షమాపణలు చెప్పని పక్షంలో ఆయనపై న్యాయపోరాటానికి దిగనున్నట్టు సంస్థ స్పష్టంచేసింది. ఈ మేరకు నోటీసులు పంపిన వ్యవహారాన్ని ప్రస్తావిస్తూ జీ న్యూస్ చీఫ్ ఎడిటర్ సుధీర్ చౌదరి ఓ ట్వీట్ చేశారు.
ఇటీవల ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తరపున పంజాబ్ మంత్రి నవజ్యోత్ సింగ్ సిద్ధూ ప్రచారానికి హాజరైన ఓ ఎన్నికల ర్యాలీలో పాకిస్తాన్ జిందాబాద్ అంటూ పాకిస్తాన్‌కి అనుకూలంగా నినాదాలు వినిపించిన నేపథ్యంలో సిద్ధూపై జీ న్యూస్ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఈ వ్యవహారంలో జీ న్యూస్‌పై ఎదురుదాడికి దిగిన నవజ్యోత్ సింగ్ సిద్ధూ.. జీ న్యూస్ ఛానెల్‌పై పలు అసత్య ఆరోపణలు చేశారు. సిద్ధూ చేసిన అసత్య ఆరోపణలు తమ సంస్థ పరువు ప్రతిష్టలకు భంగం కలిగించేవిగా వున్నాయని అభ్యంతరం వ్యక్తంచేస్తూ తాజాగా జీ న్యూస్ ఆయనకు ఈ నోటీసులు జారీచేసింది.