ఔరంగాబాద్‌: జొమాటో మొబైల్ యాప్ ద్వారా ఆర్డర్ చేసిన ఫుడ్‌లో పనీర్‌కి బదులుగా ప్లాస్టిక్ ఫైబర్ ఉన్నట్టుగా గుర్తించిన ఓ వినియోగదారుడు దీనిపై పోలీస్ కేసు పెట్టినట్టుగా ప్రముఖ న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐ ఓ వార్తా కథనాన్ని ప్రచురించింది. బాధితుడు సచిన్ జందారె కథనం ప్రకారం.. ఔరంగాబాద్‌లో శుక్రవారం చోటుచేసుకున్న ఈ ఘటన వివరాలిలా వున్నాయి. ''తన పిల్లల కోసం పనీర్ చిల్లి, పనీర్ మసాలా వంటి ఆహారం కోసం జొమాటోలో ఆర్డర్ ఇచ్చాను. డెలివరీ బాయ్ డెలివరి చేసిన ఆహారం తింటుండగా పనీర్ చాలా గట్టిగా ఉందని, అది తింటుంటే తన దంతాలకు నొప్పి కలిగిందని నా కూతురు చెప్పింది. ఏంటా అని నేను ఆ పనీర్ ముక్కలను తిని చూస్తే, అందులో ఫైబర్ ఉన్నట్టు అర్థమైంది'' అని సచిన్ జందారె వాపోయినట్టుగా ఏఎన్ఐ కథనం పేర్కొంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

''వెంటనే రెస్టారెంట్‌కి వెళ్లి ఇదే విషయమై ఫిర్యాదు చేయగా ఆ రెస్టారెంట్ యజమాని తన ఆవేదనను వినిపించుకోలేదు. అంతేకాకుండా అందులో తన తప్పిదం ఏమీ లేదని, బహుశా జొమాటో డెలివరి బాయ్ ఏమైనా చేసి ఉంటాడేమోనని నిర్లక్ష్యమైన సమాధానం ఇచ్చాడు. దీంతో వెంటనే పోలీస్ స్టేషన్‌కి వెళ్లి జరిగిన విషయమై తాను పోలీసులకు ఫిర్యాదు చేశాను'' అని సచిన్ జందారె తెలిపారు. తనలా మరెవ్వరూ మోసపోకూడదని ఈ సందర్భంగా సచిన్ ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్ చేసే వారికి సచిన్ జందారె విజ్ఞప్తి చేశాడు.


ఇదిలావుంటే, ఈ ఘటనపై స్పందించిన జొమాటో సంస్థ.. జరిగిన ఘటనపై చింతిస్తున్నట్టుగా ఓ ప్రకటన విడుదల చేసింది. వెంటనే సదరు రెస్టారెంట్‌ని తమ నెట్‌వర్క్ నుంచి తొలగించడంతోపాటు ఎక్కడ పొరపాటు జరిగిందో తెలుసుకునేందుకు దర్యాప్తు చేపట్టామని జొమాటో వివరణ ఇచ్చినట్టుగా ఏఎన్ఐ కథనం వెల్లడించింది. 


ఈ ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు స్పందిస్తూ.. ''పనీర్ నమూనాలను పరీక్షకు పంపించామని, నివేదిక వచ్చిన అనంతరం తదుపరి దర్యాప్తు ఉంటుంది'' అని తెలిపారు.