న్యూఢిల్లీ: రైల్వేశాఖ ఇక తన పనితీరు మార్చుకోనున్నదని తెలిసింది. ఇకపై చెప్పిన సమయానికి మించి రైళ్లు ఆలస్యంగా నడిస్తే సంబంధిత అధికారుల పదోన్నతులపై ప్రభావం పడుతుందని కేంద్ర రైల్వేశాఖ మంత్రి పీయూష్ గోయల్ హెచ్చరించారు. రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయని ప్రయాణీకుల నుంచి ఫిర్యాదులు రావడంతో ఆయన అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇంతకాలం రైళ్ల జాప్యానికి నిర్వహణ పనులను కారణం చూపారని.. ఇక ఆ కారణాలేవీ చెప్పొద్దని.. ఈ నెలాఖరులోగా సమయపాలనలో పరిస్థితి మారకపోతే రైల్వేస్టేషన్ల జనరల్ మేనేజర్లకు పదోన్నతులు కల్పించేది లేదని ఆయన గతవారం జోనల్ జనరల్ మేనేజర్లతో జరిగిన సమావేశంలో స్పష్టం చేశారు. సమయపాలన ఆధారంగానే సంబంధిత అధికారి పనితీరు అంచనా వేస్తామన్నారు. దేశంలో ఏ రైల్వేస్టేషన్‌లోనైనా ఇలాంటి పరిస్థితి తలెత్తితే సంబంధిత స్టేషన్ సిబ్బందిపై వేటు పడుతుందని అన్నారు. రైళ్లు సరైన సమయానికి నడిపి రైల్వేశాఖ ప్రజల మన్ననలను పొందాలన్నారు.


సెలవుల్లో డిమాండ్‌కు తగ్గట్టుగా అదనపు రైళ్లను నడిపే విషయంలోనూ జాప్యం చేయరాదన్నారు. అదనపు రైళ కేటాయింపు, రైళ్లు సమయానికి నడిచేలా చూడటం అన్నీ ఆయా రైల్వేస్టేషన్ల జీఎంలపై ఆధారపడి ఉంటుందని, స్టేషన్ సిబ్బంది కూడా బాధ్యతాయుతంగా ప్రవర్తించాలన్నారు. 2017-18లో సగటున 30శాతం రైళ్లు ఆలస్యంగా నడిచినట్లు రికార్డులు చెబుతున్నాయి. ఈ వేసవి సెలవుల్లోనైతే ఈ సంఖ్య మరింతగా పెరిగినట్లు సమాచారం.