Revanth Reddy Challenge To CM KCR: జూలై 2న ఖమ్మం బహిరంగ సభ వేదికగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సమరశంఖం పూరించాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆదేశించింది అని రేవంత్ రెడ్డి చెప్పారు. అందుకే తాము అందరం ఇక్కడకు వచ్చామని చెప్పిన రేవంత్ రెడ్డి.. ఖమ్మ సభ ఏర్పాట్లను ఎంతో పకడ్బందీగా నిర్వహిస్తున్నారు అని అన్నారు. ఖమ్మ సభ ఏర్పాట్లపై కాంగ్రెస్ పార్టీ పూర్తి సంతృప్తి వ్యక్తం చేస్తోందన్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నష్టాల్లో ఉన్న ఆర్టీసీకి తమ వంతు సహాయంగా 1500 ఆర్టీసీ బస్సులు ఖమ్మం సభ కోసం తీసుకోవలి అని అనుకున్నాం. కానీ ఒంటికన్ను శివరాసనుడు బస్సులు ఇవ్వకుండా అడ్డుకుంటున్నారని తెలిసింది అని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ఖమ్మం సభకు ఆర్టీసీ బస్సులు ఇచ్చినా.. ఇవ్వకపోయినా ప్రజలు సభకు రావడం ఆగదు అని అన్నారు. ఏదీ లేకపోతే నడుచుకుంటూనైనా ఇక్కడి ప్రజలు సభకు వస్తారు.. మీరు అడ్డుగోడలు కడితే జనం ఆ గోడలు దూకి వస్తారు.... మీరే అడ్డుగా వస్తే జనం మిమ్మల్ని తొక్కుకుంటూ వస్తారు అంటూ కేసీఆర్‌ని ఎద్దేవా చేసిన రేవంత్ రెడ్డి.. సీఎం కేసీఆర్‌కు నేను సవాల్ విసురుతున్నా.. బీఆర్ఎస్ పార్టీ సభ కంటే ఎక్కువ మంది సభలో కదం తొక్కుతారు అని స్పష్టంచేశారు. కావాలంటే లెక్క కట్టుకో కేసీఆర్.. ఖమ్మం బహిరంగ సభతో బీఆర్ఎస్ పాలనకు సమాధి కడుతాం అని హెచ్చరించారు.


ఖమ్మం బహిరంగ సభలోనే కాంగ్రస్ పార్టీలో చేరనున్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గురించి మాట్లాడుతూ, మా సీనన్న మూడో కన్నులాంటివాడు.. శివుడు మూడో కన్ను తెరిస్తే ఏమవుతుందో... బీఆర్ఎస్ పరిస్థితి కూడా అంతే అని అన్నారు. పార్టీలో పాత, కొత్త అని తేడా లేకుండా కలిసి పనిచేసుకుపోతాం.. కలిసే ముందుకు సాగుతాం అని రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఖమ్మం జిల్లాలో 10కి 10 సీట్లు గెలిపించండి... రాష్ట్రంలో 80కి పైగా సీట్లు గెలిపించే బాధ్యత మేం తీసుకుంటాం అని రేవంత్ రెడ్డి ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు, ఓటర్లకు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని గెలిపించి సోనియా గాంధీకి జన్మదిన కానుక ఇద్దాం అని పార్టీ శ్రేణులను పిలుపునిచ్చారు. 


వచ్చే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తరువాత ఖమ్మం గడ్డపై ఇక కారు గుర్తు ఉండదు.. బంగాళాఖాతంలో కలిపేస్తాం అని రేవంత్ రెడ్డి హెచ్చరించారు. నాలుగైదు నెలలుగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో చర్చలు జరిపాం. కార్యకర్తలు, అభిమానులతో చర్చించిన తరువాత వారి అభీష్టం మేరకే తను నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది అని పొంగులేటి చెప్పారు. తనకు కష్టమైనా, నష్టమైనా వారి అభిమానుల అభిప్రాయం మేరకే కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. 


గిరిజనులపై పెట్టిన కేసులను ఎనాడూ పట్టించుకోని కేసీఆర్.. గిరిజనుల సమస్యలను ఏనాడూ పట్టించుకోని కేసీఆర్... తీరా ఎన్నికల సమయం వచ్చేసరికి ఇవాళ పోడు భూములకు పట్టాలు అంటూ గిరిజనుల ఓట్లు దండుకునే ప్రయత్నం చేస్తుండు అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ పోరాట ఫలితం వల్లే అధికార పార్టీ పోడు భూములకు పట్టాలు పంపిణి చేస్తోంది అని పేర్కొన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గిరిజనుల సంఖ్య అధికంగా ఉంది. ఇదే జిల్లా నుంచి బలమైన నేతగా ఉన్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు అనే భయంతోనే కేసీఆర్ ఇప్పుడు హడావుడిగా పోడు పట్టాలు ఇస్తుండు అని రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. ఏనాడూ సచివాలయానికే రాని కల్వకుంట్ల చంద్రశేఖర్ రావును ప్రజల బాట పట్టించేలా చేశాం. 


ఎన్నికల ముందు గిరిజనులను కాకా పట్టి వారి ఓట్లు సంపాదించుకోవడం కోసమే ఎలక్షన్ శాంపిల్‌గా కేసీఆర్ ఈ పోడు పట్టాలు పంచిపెడుతుండు అని మండిపడిన రేవంత్ రెడ్డి.. అసలు ఈ ప్రభుత్వమే ఒక శాంపిల్ ప్రభుత్వం అని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ పార్టీ టికెట్లు ఇవ్వనందుకే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి వెళుతున్నాడని మంత్రి కేటీఆర్ చెబుతున్నాడు. కానీ ఆనాడు చంద్రబాబు నాయుడు పదవి ఇవ్వకపోతేనే కదా మీ అయ్య టీడీపీని వీడి బయటికొచ్చిండు అంటూ కేటీఆర్‌కి కౌంటర్ ఇచ్చారు. ఖమ్మంలో జూలై 2న జరగనున్న తెలంగాణ జన గర్జన సభ సాక్షిగా బీఆర్ఎస్ పార్టీని బొంద పెట్టడం ఖాయం అని రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ సర్కారు పెద్దలకు హెచ్చరికలు జారీచేశారు.