దీపావళి భారతీయ పండుగలలో ఒకటి. భాష, ప్రాంతం అనే తేడా లేకుండా జమ్మూ నుండి కన్యాకుమారి వరకు ఆనందోత్సాహాల నడుమ సమైక్యంగా జరుపుకొనేదే దీపావళి. అయితే సంస్కృతి, సాంప్రదాయాల ప్రకారం చూసినట్లయితే ఒక్కో రాష్ట్రంలో దీపావళి పండుగను ఒక్కో విధంగా జరుపుకుంటారు. ఉదాహరణకు దీపావళి పండుగను దక్షిణ భారతదేశంలో మూడు రోజులు చేసుకుంటాం.. కానీ,  ఉత్తర భారతదేశంలో  ఐదు రోజులు చేస్తాం. అలానే వివిధ ప్రదేశాలలో కూడా రకరకాల ఆచారవ్యవహారాలు పాటిస్తారు. వాటి గురించి సంక్షిప్త సమాచారం ఇప్పుడు తెలుసుకుందాం ..!


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


జైపూర్ 


పింక్ సిటీ గా పిలువబడే జైపూర్ లో దీపావళి వేడుకలు వైభవంగా జరుగుతాయి. పండుగరోజున ఇళ్లకు సున్నాలు వేయించి ప్రమిదలు వెలిగిస్తారు. మార్కెట్లన్నీ కాంతులతో జిగేలు మంటూ కనిపిస్తాయి. మట్టి దీపాలు తలమీద పెట్టుకొని నాట్యం చేస్తారు. హస్తకళా వస్తువులు, సంప్రదాయ వస్త్రాలతో, స్థానిక ఆహార రుచులతో మార్కెట్లు, వీధులు సందడి సందడిగా కనిపిస్తాయి. 



వారణాసి


ఉత్తర భారతదేశంలో దీపావళి వైభవంగా జరిగే ప్రదేశాల్లో ముందుంటుంది వారణాసి. బెనారస్ అని కూడా పిలువబడే వారణాసిలో దీపావళి సందడంతా ఘాట్ల వద్దే కనిపిస్తుంది. పండుగ సీజన్లో గంగా నదికి, కాశీ విశ్వనాథునికి ప్రత్యేక హారతులు ఇస్తారు. సాయంత్రం ఘాట్ వద్ద గంగమ్మ తల్లికి ఇచ్చే హారతి చూడటానికి రెండుకళ్లూ సరిపోవు. దీపావళి చివరి రోజున పదిలక్షల మంది మట్టిప్రమిదలను వెలిగించి గంగా నదిలో వదులుతారు. 



కోల్కతా 


కోల్కతాలో దీపావళిని ప్రజలు అత్యంత భక్తి శ్రద్దల మధ్య జరుపుకుంటారు. ఇక్కడ భిన్నంగా లక్ష్మీదేవి పూజకు బదులు కాళీ దేవి పూజలు జరుపుతారు. ఇక్కడ కాళీమాతను శక్తివంతమైన దేవతగా పరిగణిస్తారు కనుక అలా చేస్తారు. స్వీట్లు, పూలు, చేపలు, మాంసం, గేదె మాతకు అర్పిస్తారు. నగరంలో ప్రత్యేక ప్రదేశాల్లో బాణాసంచా కాల్చుతారు. 



అమృత్సర్ 


అమృత్సర్ లో దీపావళి సందడంతా స్వర్ణదేవాలయం వద్దే కనిపిస్తుంది. స్వర్ణదేవాలయం లోపల, కాంతులతో దేదివ్యమానంగా కనిపిస్తుంది. బాణాసంచా వెలుగులు టెంపుల్ కు వచ్చే భక్తులను, యాత్రికులను ఆకట్టుకుంటుంది. సంప్రదాయ మట్టి ప్రమిదలను వెలిగించి స్థానికులు పండుగ జరుపుకుంటారు. 



గోవా 


గోవా అంటే రేవ్ పార్టీలు, చిందులు, పశ్చాత్య సంప్రదాయాలకు అలవాటుపడిన ప్రజలు ఉంటారని ఒక అపోహ ఉంది. కానీ ఇలాంటి ప్రాంతాల్లో కూడా దీపావళి పండుగను ప్రత్యేకంగా జరుపుకుంటారు. గోవాలో దీపావళి జరిగే రోజుల్లో ప్రతి ఇంటి ముందు గుమ్మానికి రంగురంగుల లాంతర్లు వేలాడదీస్తారు. నరక చతుర్దశి నాడు నరకాసుర వధ కార్యక్రమం ముగించి టపాసులు కాల్చుతారు. 



కోవలం 


దీపావళి పండుగనాడు బాణాసంచా శబ్దాలకు, సందళ్లకు, సంబరాలకు దూరంగా గడపాలనుకొనేవారికి కేరళలోని కోవలం సూచించదగినది. దేశం మొత్తం దీపావళి సందడి కనిపించినా ఇక్కడ దీపావళి పండుగ తీవ్రత చాలా చాలా తక్కువ. కనుక మీరు ఇక్కడ ప్రదేశ అందాలను ఆస్వాదిస్తూ హాయిగా సెలవులను గడపవచ్చు.