ఇండియా గేట్ చూసొద్దామా..!
ఇండియా గేట్ న్యూఢిల్లీ నగరంలో తప్పక చూడవలసిన పర్యాటక ప్రదేశం. ఇది యమునా నది ఒడ్డున ఉంది.
పర్యాటక ప్రదేశం : ఇండియా గేట్
నగరం: న్యూ ఢిల్లీ
రాష్ట్రం:ఢిల్లీ-ఎన్సిఆర్
ఇండియా గేట్ న్యూ ఢిల్లీ నగరంలో తప్పక చూడవలసిన పర్యాటక ప్రదేశం. ఇది యమునా నది ఒడ్డున ఉంది. నగరంలో చూడవలసిన అతికొద్ది పర్యాటక స్థలాలలో ఇది కూడా ఒకటి. మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో, ఆఫ్ఘన్ యుద్ధ సమయంలో అమరులైన 90 వేల మంది జవాన్ల జ్ఞాపకార్థం అప్పటి ప్రభుత్వం ఈ స్మారక కట్టడాన్ని నిర్మించింది.
ఎవరు? ఎప్పుడు?
మొదటి ప్రపంచ యుద్ధం (1914-1918), ఆ తరువాత జరిగిన ఆఫ్ఘన్ యుద్ధంలో మరణించిన భారత, బ్రిటీష్ జవాన్ల జ్ఞాపకార్థం ఒక అపురూప కట్టడం నిర్మించాలని అనుకుంది అప్పటి బ్రిటీష్ ఇండియా ప్రభుత్వం. ఆ ఆలోచనే ఈ కట్టడానికి పునాది వేసింది. ఈ కట్టడంపై యుద్ధంలో మరణించిన అమరజవానుల పేర్లు కూడా లిఖించబడ్డాయి. ఢిల్లీలో అనేక కట్టడాలను డిజైన్ చేసిన ఎడ్విన్ ల్యుటెన్స్ ఈ కట్టడానికి రూపకల్పన చేశాడు.
1921, ఫిబ్రవరి 10న డ్యూక్ ఆఫ్ కన్నాట్ ఇక్కడ పునాదిరాయి వేశారు. ఈ కట్టడం పూర్తవడానికి 10 ఏళ్ల సమయం పట్టింది. దీని ప్రారంభ నామం 'ఆలిండియా మెమోరియల్ వార్'. ఈ కట్టడానికి ఇరువైపులా పైభాగంలో ఇండియా గేట్ అనే పదాలు స్పష్టంగా కనిపించేటట్లు రాయి చెక్కబడింది. 1971లో నాటి భారత ప్రధాని ఇందిరా గాంధీ ఇండో-పాకిస్థాన్ యుద్ధంలో అమరులైన భారత జవాన్ల జ్ఞాపకార్థం ఈ కట్టడం క్రింది భాగాన అమర్ జవాన్ జ్యోతి ప్రారంభించారు. అప్పటి నుంచి ఇక్కడ ఆ జ్యోతి వెలుగుతోంది.
విశేషాలు
ఇండియా గేట్ ఎత్తు 42 మీటర్లు. భరత్ పూర్ ప్రాంతానికి చెందిన ఎర్రరాయితో ఈ కట్టడాన్ని నిర్మించారు. ఇక్కడ 1971 నుంచి అమర్ జవాన్ వెలుగుతోంది. ఇండియా గేట్ చుట్టుప్రక్కల పిల్లలు ఆడుకోవడానికి పార్కులు, సేదతీరడానికి బోట్ క్లబ్‌లు, పచ్చిక బయళ్లు ఉన్నాయి. రాష్ట్రపతి భవన్ ఇండియా గేట్ నుంచి ఎంచక్కా కనపడుతుంది.
ఎలా వెళ్ళాలి ?
ఢిల్లీ మెట్రో స్టేషన్ : బారాఖంబా మెట్రో స్టేషన్‌లో దిగాలి. అక్కడి నుంచి ఆటో లేదా టాక్సీలో 10 నిమిషాలు ప్రయాణిస్తే ఇండియా గేట్ చేరుకోవచ్చు.
రైలు : దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి ఢిల్లీకి రైలు సదుపాయం ఉంది. హైదరాబాద్, వైజాగ్, తిరుపతి, విజయవాడ తదితర ప్రాంతాల నుంచి నేరుగా ఢిల్లీ వరకు రైళ్లు నడుస్తాయి.
విమాన మార్గం: హైదరాబాద్, విజయవాడ, వైజాగ్, తిరుపతి నుంచి నేరుగా ఢిల్లీకి విమాన సర్వీసులు ఉన్నాయి.