కంగనా రనౌత్ కట్టుకున్న బంగ్లా ఖరీదు ఎంతో తెలుసా ?
కంగనా రనౌత్ బంగ్లా కూడా ఆమధ్య సోషల్ మీడియాలో ఓ హాట్ టాపిక్ అయ్యింది.
ఇటీవల కాలంలో క్వీన్ ఆఫ్ బాలీవుడ్ అని పిలిపించుకున్న కంగనా రనౌత్ ఈమధ్యే కష్టపడి ఓ బంగ్లాను కట్టించుకుంది. కంగనా రనౌత్ బంగ్లా కూడా ఆమధ్య సోషల్ మీడియాలో ఓ హాట్ టాపిక్ అయ్యింది. అంతగా కంగనా రనౌత్ బంగ్లాకు వున్న ప్రత్యేకతలు ఏంటని ఆరాతీస్తే తెలిసింది ఏంటంటే, ఈ బంగ్లా కోసం కంగనా చాలా పరిశోధన చేయడం మాత్రమే కాదు.. ఇంకెంతో సమయం, డబ్బు వెచ్చించిందని. అవును, 2014లో క్వీన్ సినిమా రిలీజైన వెంటనే, తన స్వస్థలమైన మనాలిలో రూ. 10 కోట్లు వెచ్చించి మరీ ఈ బంగ్లా కోసం స్థలం కొనుగోలు చేసిందట ఆమె. ఆ తర్వాత తాను కోరుకున్న విధంగా బంగ్లాను నిర్మించే ఆర్కిటెక్ కోసం ఓ చిన్నపాటి పరిశోధనే చేసిన కంగనాకు ఆ టైమ్‌లో కనిపించిన ఆర్కిటెక్ శబ్నం గుప్త. ముంబైలో పేరున్న ప్రముఖులు, ధనవంతులకి బంగ్లాల డిజైన్ ఇచ్చిన ఫేమస్ ఆర్కిటెక్ అయిన శబ్నం గుప్త.. కంగనా అభిరుచికి అనుగుణంగా ఈ బంగ్లాను డిజైన్ చేసింది.
దేశంలోనే అందమైన పర్యాటక ప్రాంతమైన మనాలిలో కంగనా కట్టుకున్న ఈ బంగ్లాలో 8 బెడ్ రూమ్స్ వున్నాయి. ప్రతీ బెడ్ రూమ్‌కి ఒక్కో బాల్కనీ వుండటం ఒక ప్రత్యేకత అయితే, ఏ బెడ్ రూమ్స్‌లోంచి చూసినా.. చుట్టూ వున్న అందమైన పర్వతాలే కనిపించడం ఈ బంగ్లాకు వున్న మరో ప్రత్యేకత. శీతాకాలంలోనూ సూర్య కాంతికి డోకా లేకుండా అతిథులు కూర్చుని మాట్లాడుకునేందుకు వీలుగా అందమైన కన్సర్వేటరీ ఈ బంగ్లాకు అదనపు ఆకర్షణ. ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయే ప్రాంతం కావడంతో ఇంట్లోని వాతావరణం వెచ్చగా వుండేందుకు వీలుగా లివింగ్ రూమ్.. ఇలా ఒకటేంటి, రెండేంటి ? ఇంట్లో ప్రతీ భాగం ఓ ప్రత్యేకమే.. ప్రతీ అంగుళం రమనీయమే.
ఇల్లుని అందంగా కట్టుకోవడమే కాదు.. ఇంటి చుట్టూ అంతే అందమైన, ఆహ్లాదకరమైన పరిసరాలు వుండేలా ఎంతో జాగ్రత్త వహించింది కంగనా రనౌత్. ఇక ఇంట్లో ఎక్కడా చూసినా మనాలీ సంస్కృతి, సంప్రదాయం, ప్రత్యేకతలని తెలిపే కళాకృతులే దర్శనమిస్తాయి. ఇంటికి వచ్చే అతిథులకి కంగనా ఇంటిని చూస్తే మనాలి అందాలని చూసినట్టుగా వుండాలనే ఆకాంక్షలోంచి వచ్చిన ఆలోచనకు ప్రతిరూపాలే కంగనా ఇంట్లో కనిపించే అందమైన కళాకృతులు. కంగనాకు ఫిట్‌నెస్ అన్నా కూడా ప్రాణమే. అందుకే ఇంట్లోనే జిమ్నాషియం, యోగా కోసం మరో గదిని ప్రత్యేకంగా ఏర్పాటు చేయించుకుంది.
ఇన్ని ప్రత్యేకతలతో తనకు నచ్చిన విధంగా ఇల్లు కట్టించుకున్న కంగనా రనౌత్ ఈ ఇంటి నిర్మాణం కోసం రూ.20 కోట్లు ఖర్చు చేసింది. ఈ ఇంటి నిర్మాణం కోసం నాలుగేళ్ల సమయం కూడా పట్టింది. అంటే ఈ ఇంటి ఖరీదు రూ.30 కోట్లు అన్న మాట. అంతేకదా.. ఇంతకన్నా ఎక్కువ ఖరీదైన ఇళ్లు కొనుగోలు చేసిన ప్రముఖులు కూడా వున్నారు కదా అని అనిపించవచ్చు. అయితే, అప్పటికే ఎవరో నిర్మించిన ఓ బంగ్లాని ఎన్ని కోట్లు పెట్టి కొనుకున్నా.. తమకి తాము ఇష్టపడి, కష్టపడి, దగ్గరుండి కట్టించున్న సంతృప్తి మాత్రం రాదు కదా!! అందుకే.. ఆ ఒక్క విషయంలో కంగనా దిల్ ఫుల్ ఖుష్.