తమలపాకు పూజ ఎందుకు?
మీకు తెలుసా ? ఆంజనేయస్వామిని తమలపాకులతో పూజించడానికి ఒక కారణం ఉంది. ఒకసారి పురాణాల్లోకి వెళితే..ఓ రోజు సీతాదేవి శ్రీరాముడికి తమలపాకు చిలకల్ని నోటికి అందిస్తుంది. అప్పుడు ఆంజనేయస్వామి శ్రీరాముడిని "స్వామీ! నేనొక చిన్న సందేహం ఉండబట్టలేక అడుగుతున్నాను. మీరు తింటున్నది ఏమిటీ? నోరు అంత ఎర్రగా ఎందుకు మారింది?"అని అడుగుతాడు. అప్పుడు శ్రీరాముడు "దీనిని తమలపాకు అంటారు. దీన్ని తింటే నోరు ఎర్రగా తయారవుతుంది. ఆరోగ్యానికీ చాలా మంచిది కూడా" అని సమాధానమిస్తాడట. ఆ సందేహం తీర్చుకున్న ఆంజనేయస్వామి వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోయి ఒళ్లంతా తమలపాకు ఆకుల్ని చుట్టుకొని గంతులేసుకుంటూ ఆనందంగా వస్తాడు. అదీ ఆంజనేయస్వామికి, తమలపాకుకీ మధ్య ఉన్న సంబంధం. ఆంజనేయస్వామి కూడా ఎప్పుడూ తమలపాకు తోటల్లో, అరటి తోటల్లో ఎక్కువగా విహరిస్తాడని అంటారు. ఆంజనేయస్వామి రుద్రసంభూతుడనే విషయం తెలుసుగా? అందుకే ఆయనను తమలపాకు ఆకులతో పూజిస్తారు. అలా చేస్తే ఆయన శాంతిస్తాడని కొందరి నమ్మకం. హనుమంతుడిని తమలపాకులతో పూజించడం వలన మనకు కూడా మనశ్శాంతి కలుగుతుంది. అలాగే నాగదోష విముక్తి కూడా జరుగుతుంది.