సంక్రాంతి పండగ వచ్చిందంటే చాలు.. భారతావనిలోని గ్రామీణ ప్రాంతవాసులు ఎంతో ఉత్సాహంగా, హుషారుగా ఉత్సవాలకు శ్రీకారం చుడతారు. రైతుకు పంట చేతికొచ్చే రోజు కాబట్టి.. వారు సంక్రాంతి లక్ష్మికి కానుకలర్పించి.. తమ జీవితమంతా సుఖ, సంతోషాలతో తులతూగాలని ఆ దేవదేవిని మనస్ఫూర్తిగా కోరుకుంటారు. సంక్రాంతి నేడు ప్రతీ హిందువు ఇంటికి కళ తెచ్చే గొప్ప పర్వదినంగా జగద్విఖ్యాతం చెందింది. ఈ క్రమంలో సంక్రాంతి గురించి మరిన్ని విషయాలు మీకోసం..!


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

*దక్షిణాయనం ముగిసి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమయ్యే వేళ, పుష్య మాసాన సూర్యభగవానుడు మకర రాశిలోకి ప్రవేశించే తరుణంలో వచ్చే పండుగ 'సంక్రాంతి' అని అంటుంటారు పెద్దలు. ఇది మూడు రోజుల పండుగ. 


*సంక్రాంతి తొలి రోజున ఉదయాన్నే లేచి అందరూ ఇంటి ముందు ముగ్గులు వేస్తారు. ఆ రంగవల్లుల మధ్యలో "గొబ్బెమ్మలు" అలంకరిస్తారు. ఆ తర్వాత వీధుల్లోకి వచ్చి భోగిమంటలు వేస్తారు.చిన్నపిల్లలకు భోగిపండ్లు తినిపిస్తారు. కొన్ని చోట్ల సంక్రాంతి పర్వదినాన బొమ్మల కొలువులు ఏర్పాటు చేసే సంప్రదాయం కూడా ఉంది


*సంక్రాంతిలో భాగంగా జరిగే రెండవ రోజు పండగ నాడు పితృదేవతలకు "తర్పణాలు" వదులుతారు. ఈ రోజున స్వర్గ వాకిళ్లు తెరుస్తారని భక్తుల నమ్మకం. ఇదే రోజు కొన్ని ప్రాంతాల్లో 'తిల సంక్రాంతి’ జరుపుకుంటారు. ఈ రోజు నువ్వులను తమ ఆరాధ్య దేవతలకు నైవేద్యంగా పెడితే, శుభం కలుగుతుందనేది వారి నమ్మకం


*సంక్రాంతిలో భాగంగా జరిగే మూడవ రోజు జరుపుకొనే పండుగే కనుమ పండుగ. దీనినే పశువుల పండుగ అని కూడా అంటారు. ఈ రోజున గోవులను పూజిస్తారు. వాటిని నిండుగా అలంకరిస్తారు. తమిళనాడు ప్రాంతంలో ఇదే రోజు "జల్లికట్టు" ఆడే సంప్రదాయం కూడా ఉంది. 


*సంక్రాంతి నాడు పతంగులు ఎగురవేసే సంప్రదాయం కూడా కొన్ని చోట్ల ఉంది. హైదరాబాద్ లాంటిచోట్ల సంక్రాంతిని పురస్కరించుకొని గాలిపటాల పండుగలు కూడా నిర్వహిస్తూ ఉండడం ఆనవాయితీగా వస్తోంది.


*సంక్రాంతిని పురస్కరించుకొని తమ ఇండ్లకు వచ్చే హరిదాసులకు, కొమ్మదాసరులకు, గంగిరెడ్లను ఆడించే వారికి కానుకలను అందివ్వడం, వారికి మిఠాయిలు, బియ్యం పంచిపెట్టడం కూడా అనేక సంవత్సరాలుగా సంప్రదాయంగా వస్తోంది.


*సంక్రాంతి సందర్భంగా పలువురు మహిళలు నోములు కూడా నోచుకుంటారు. బొమ్మల నోము, గొబ్బి గౌరీవ్రతం, గోదాదేవి నోము అందులో ప్రధానమైనవి


*సంక్రాంతి పండుగ గురించి శాస్త్రపరంగా చాలా విషయాలు చెప్పుకోవచ్చు.  మనకున్న 12 రాశుల్లో  సూర్యుడు నెలకొక రాశిలోకి ప్రవేశిస్తాడు. సూర్యుడు ఏ రాశిలోకి ప్రవేశిస్తే.. ఆ రాశిని సంక్రాంతిగా పరిగణిస్తారు. ఆ విధంగా సంవత్సరానికి 12 సంక్రాంతులు ఉంటాయి. సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించినప్పుడు దానిని 'మకర సంక్రాంతి' అంటారు.