పాలుతాగలేదని.. పసిబిడ్డను వదిలేశాడు..!
అమెరికాలోని టెక్సాస్‌లో ఒక ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. పాలు తాగడం లేదని తన మూడేళ్ళ పసిపాపను వీధిలో వదిలేసి తలుపు గడియ వేసేశాడు ఓ ప్రబుద్ధుడు. ఆమె తన పెంపుడు కూతురు కావడం వల్లే అలా చేశాడని స్థానికులు అంటున్నారు. వివరాల్లోకి వెళ్తే టెక్సాస్‌కు చెందిన వెస్లీ మాథ్యూస్ అనే అమెరికా పౌరుడు మూడేళ్ళ భారతీయ బాలికను దత్తత తీసుకొన్నాడు. ఉదయం మూడు గంటల ప్రాంతంలో తన కూతురికి పాలు పట్టడానికి ప్రయత్నించిన మాథ్యూస్, ఆమె ఎంతకీ తాగకపోయేసరికి విసుగుచెంది, ఆమెను బయటకు తీసుకొచ్చి చీకటిలో వదిలిపెట్టాడు. ఓ అయిదు నిముషాల తర్వాత తలుపు తీసి చూసేసరికి ఆమె అదృశ్యమైంది. ఈ విషయాన్ని మాథ్యూస్ ద్వారానే తెలుసుకున్న స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ప్రస్తుతం మూడేళ్ళ షెరిన్ మాథ్యూస్ కోసం నగరమంతా గాలిస్తున్నారు స్పెషల్ పోలీసు అధికారులు. దాదాపు మూడు కిలోమీటర్ల వరకు గాలింపు చర్యలు మొదలుపెట్టారు. అయినా ఆమె జాడ దొరకలేదు. షెరిన్ జాడ కోసం జాగిలాలలను కూడా రంగంలోకి దింపిన పోలీసులు సెర్చ్‌ను వేగిరం చేస్తున్నారు.
ఈ కేసు దర్యాప్తు నిమిత్తం షెరిన్ పెంపుడు తండ్రి వెస్లీ మాథ్యాస్‌ను కస్టడీలోకి తీసుకొన్నారు పోలీసులు. చిన్నారి హక్కులను హరించి తనను మానసికంగా బాధించి, ఆమె అదృశ్యానికి కారణమైనందుకు గాను కేసును నమోదు చేశారు. అలాగే చిన్నారి తల్లిని కూడా ప్రశ్నించారు. అయితే తల్లిదండ్రులిరువురూ పొంతన లేని సమాధానాలు చెబుతుండడంతో పోలీసులు వారిపై కూడా అనుమానం వ్యక్తం చేస్తు్న్నారు. ప్రస్తుతం మాథ్యూస్ రెండవ కుమార్తెను ఈ కేసు తేలేవరకు చైల్డ్ ప్రొటెక్షన్ సర్వీసెస్ వారి ఆధ్వర్యంలో ఉంచాలని నిర్ణయం తీసుకొన్నారు. అదే విధంగా, చిన్నార షెరిన్ జాడ కనుగొనేందుకు డ్రోన్ల సహాయం కూడా తీసుకుంటున్నారు. సీసీ టీవీ ఫుటేజిని కూడా సేకరిస్తున్నారు. ఈ కేసులో స్థానికులు చెబుతున్న వేరే కథనాలు కూడా ఉన్నాయి. షెరిన్ ఏ రోజైతే మిస్ అయ్యిందో.. అదే రోజు ఉదయం ఓ గంటసేపు మాథ్యూస్ కుటుంబం వాడే కారు కనిపించలేదని.. బహుశా కుటుంబ సభ్యులే షెరిన్‌ను ఏదో చేసి ఉండవచ్చని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ కేసు రిచర్డ్‌సన్ పోలీసుశాఖ వారి ఆధ్వర్యంలో నడుస్తోంది.