తత్కాల్ పాస్ పోర్టు.. ఇక ఈజీ!
పాస్ పోర్టు తిప్పలు ఇక మీదట ఉండవు. తత్కాల్ కింద జారీ చేసే పాస్ పోర్టులకు సంబంధించిన నిబంధనలను భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ సడలించింది.
పాస్ పోర్టు అవస్థలు ఇక మీదట ఉండవు. తత్కాల్ కింద జారీ చేసే పాస్ పోర్టులకు సంబంధించిన నిబంధనలను భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ సడలించింది. దీంతో తత్కాల్ పాస్ పోర్టులు పొందటం ఇకమీదట సులభం కానున్నాయి.
ఇప్పటివరకు.. తత్కాల్ పాస్ పోర్టు పొందాలంటే అనెక్సర్ 'ఎఫ్' విభాగం కింద క్లాస్ 1 ఆఫీసర్ సంబంధిత వ్యక్తికి తత్కాల్ కింద పాస్ పోర్టు ఇవ్వొచ్చని ఒక ధ్రువ పత్రం ఇచ్చేవారు. ఆ ధ్రువ పత్రం ఉంటేనే తత్కాల్ ఇస్తారు. అయితే తాజాగా కేంద్రం ఆ నిబంధనను సడలించింది. క్లాస్ 1 ఆఫీసర్ సర్టిఫికేట్ లేకున్నా.. ఆధార్ నెంబర్ ఆధారంగా తత్కాల్ పాస్ పోర్టు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ విధానం జనవరి 25, 2018 నుంచి అమలులోకి వస్తుందని పేర్కొంది. దరఖాస్తు సమర్పించిన మూడు పనిదినాల్లో తత్కాల్ మంజూరు చేయాలని ఉత్తర్వుల్లో పెర్కొంది.
కేంద్ర విదేశాంగ కార్యదర్శి మాట్లాడుతూ.. "భారత ప్రభుత్వం తన ప్రజలను పూర్తిగా విశ్వసించిందని ప్రజలకు తెలియచేయడానికి మేము ఈ చర్యలు తీసుకున్నాము. దరఖాస్తుదారుడు సక్రమైన రీతిలో చెల్లుబాటయ్యే అవసరమైన పత్రాలను సమర్పించినపుడు దానిని ధృవీకరించడానికి ఒక మధ్యవర్తి (క్లాస్ 1 ఆఫీసర్) అవసరం లేదు" అని ఆయన చెప్పారు. ఈ కొత్త నిబంధనతో, తత్కాల్ కేటగిరీలో దరఖాస్తు చేసుకొనేటప్పుడు ఆధార్ కార్డ్, పాన్ కార్డు మరియు ఎన్నికల కార్డుల అవసరం ఉంటుంది.
క్లాస్ 1 ఆఫీసర్ కేటగిరీలో భారత ప్రభుత్వం లేదా రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేసే డిప్యూటీ సెక్రటరీ స్థాయిలో లేదా పైస్థాయి అధికారి ఉంటారు. అలాగే, గెజిటెడ్ అధికారుల కేటగిరీలో ఉన్న జిల్లా కలెక్టర్, పోలీసు సూపరింటెండెంట్, అసిస్టెంట్ కమిషనర్లు, తహసిల్దార్లు లేదా ప్రభుత్వ అధికారులను కూడా క్లాస్ 1 అధికారులుగా భావిస్తారు.