భారత సంతతికి చెందిన ఒక సిక్కు నేతకు మలేషియా దేశ చరిత్రలో తొలిసారిగా మంత్రి పదవి దక్కింది. న్యాయవాది గోవింద్‌ సింగ్‌ దేవ్‌ (45) ఇటీవలే మలేసియాలో ఏర్పడిన నూతన ప్రభుత్వంలో కేబినెట్‌ మంత్రి అయ్యారు. మలేషియా ప్రధాని మహతిర్‌ మహమ్మద్‌ భారత సంతతికి చెందిన ఇద్దరిని తన కేబినెట్‌లోకి తీసుకున్నారు. గోవింద్‌ సింగ్‌ దేవ్‌కు కమ్యూనికేషన్‌, మల్టీ మీడియా శాఖను ఇవ్వగా.. మరో భారత సంతతి నేత, డెమొక్రాటిక్‌ ఏక్షన్‌ పార్టీ(డీఏపీ) జాతీయ వైస్‌ ఛైర్మన్ ఎం కులశేగరన్ ‌(61)కు మానవ వనరుల అభివృద్ధి శాఖను ఇచ్చారు.


గోవింద్‌ సింగ్‌ 2008లో జరిగిన సాధారణ ఎన్నికలలో మొదటిసారి ఎంపీగా ఎన్నికయ్యారు. 2013లో దిగువ సభకు మళ్లీ  తిరిగి ఎన్నికయ్యారు. ఈ ఏడాది ఎన్నికలలో 47,635 ఓట్ల తేడాతో గెలిచారు. కాగా మలేషియా జనాభాలో దాదాపు లక్ష మంది సిక్కులు ఉన్నారు. గోవింద్‌ సింగ్‌ మంత్రిగా ఎన్నికకావడం పట్ల వారు సంతోషం వ్యక్తం చేశారు.