ఎన్నారై ట్వీట్‌పై సుష్మా స్పందన
కేంద్ర విదేశాంగశాఖ మంత్రి సుష్మా స్వరాజ్ ట్విట్టర్ ద్వారా తనకు చేరిన మరో అభ్యర్థనకు స్పందించారు. మలేషియా ఎయిర్‌పోర్టులో పాస్‌పోర్టు కోల్పోయి.. దిక్కుతోచని స్థితిలో ఉన్న భారతీయ కుటుంబం చేసుకున్న వినతి మేరకు సుష్మా స్వరాజ్ జవాబు ఇచ్చారు. ఆ కేసును ఎమర్జన్సీ కేసుగా పరిగణించి, వెంటనే ఆ కుటుంబానికి సహకరించాల్సిందిగా మలేషియాలోని ఇండియన్ ఎంబసీకి ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ పై స్పందించిన ఎంబసీ వెంటనే వివరాలు కోరుతూ సదరు కుటుంబాన్ని సంప్రదించింది. "మేడమ్.. మా కుటుంబ పాస్ పోర్టులు ఎయిర్ పోర్టులో మిస్ అయ్యాయి. ఎంబసీని కలుద్దామనుకుంటే ఈ రోజు సెలవు దినం. మాకు ఎలాగైనా సహాయం చేయండి" అని మీరా రమేష్ పటేల్ అనే మహిళ చేసుకున్న అభ్యర్థన మేరకు తన ట్విటర్ ద్వారా సుష్మా స్వరాజ్ స్పందించారు. ఈ కేసును అత్యవసర కేసుగా పరిగణించి, ఎంబసీ కార్యాలయాన్ని ఆ రోజు తెరవాల్సిందిగా కోరారు.
ఈ మధ్యకాలంలో అత్యవసర పరిస్థితులలో విదేశాలలో చిక్కుకున్న భారతీయులు ట్విట్టర్ ద్వారా మంత్రి సుష్మా స్వరాజ్‌కు ట్వీట్ చేయడం, వాటిపై ఆమె స్పందించడం పరిపాటిగా మారింది. అందువల్ల ఆమెకు ప్రశంసలు కూడా లభిస్తున్నాయి. ఫారిన్ పాలసీ మ్యాగజైన్ ఇటీవలే ప్రకటించిన గ్లోబల్ థింకర్స్ ఆఫ్ 2016 జాబితాలో ఈ విషయమై సుష్మా స్వరాజ్ పేరును కూడా ప్రస్తావించడం కూడా జరిగింది. సౌదీ అరేబియాలో 10,000 మంది భారతీయ వర్కర్లు ఉపాధి కోల్పోయి, ఆహారం లేక ఇబ్బందులు పడుతున్న సందర్భంలో సుష్మా స్వరాజ్ ఆ విషయంపై స్పందిస్తూ చేసిన ట్వీట్ దాదాపు ఆమెను అనుసరిస్తున్న 6 మిలియన్ల మంది ఫాలోవర్లకు చేరింది. అలాగే ఇటీవలే చిన్నారుల మెడికల్ ట్రీట్‌మెంట్ కోసం వీసాలకు ప్రయత్నిస్తున్న పాకిస్తానీయులకు కూడా అత్యవసరం సహాయం చేయాల్సిందిగా ఆమె కోరారు.