సిక్కు బాలుడిపై దాడి - సుష్మా స్పందన
అమెరికాలోని వాషింగ్టన్ రాష్ట్రంలో ఓ సిక్కు బాలుడిపై దాడి జరిగింది. ఈ విషయం తనకు తెలిసిన వెంటనే భారత విదేశాంగశాఖ మంత్రి సుష్మా స్వరాజ్ స్పందించారు. ఈ సంఘటనపై అక్కడి భారత ఎంబసీ అధికారులను సంప్రదించి పూర్తి నివేదికను అందించాల్సిందిగా కోరారు. ఇదే విషయాన్ని తెలుపుతూ ఆమె ట్వీట్ చేయడం జరిగింది. వాషింగ్టన్‌లోని ఓ స్కూలులో చదువుతున్న 14ఏళ్ల సిక్కు కుర్రాడిపై, అదే పాఠశాలలో చదువుతున్న కొందరు విద్యార్థులు దాడి చేశారు. ఒక భారతీయుడన్న భేదభావం వలనే తన బిడ్డపై ఈ దాడి చేశారని ఆ కుర్రాడి తండ్రి తెలియజేశారు. సిక్కు ఆచారం ప్రకారం తలపాగా ధరించడం ఆనవాయితీ. అయితే అలా తలపాగా ధరించడం వల్లే ఆ బాలుడిని దూషిస్తూ.. కొందరు విద్యార్థులు దాడి చేశారని విద్యార్థి తండ్రి ఆరోపించారు. విద్యార్థులు దాడి చేస్తున్న ఘటనను మరో విద్యార్థి వీడియో తీసి, దానితో పాటు జాతి విద్వేషాన్ని రగిల్చే కామెంట్స్ సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో ఈ వార్త వెలుగులోకి వచ్చింది. అయితే ఈ దాడికి కారణం.. జాతి విద్వేషాలు కాదని... దాడికి పాల్పడిన విద్యార్థులతో.. సిక్కు విద్యార్థి తరగతి గదిలో గొడవపడడం వలనే అలా జరిగిందని పాఠశాల యాజమాన్యం చెబుతోంది.