డల్లాస్‌లో తెలంగాణ టెక్కీ అనుమానాస్పద మృతి
కృష్ణ చైతన్య వుంటున్న గది తలుపులు బద్ధలు కొట్టి లోపలికి వెళ్లిన పోలీసులకు అక్కడ అతడు తన బెడ్‌పై శవమై కనిపించాడు.
మూడేళ్ల క్రితం తెలంగాణలోని సిద్ధిపేట నుంచి అమెరికా వెళ్లిన వెంకన్నగారి కృష్ణ చైతన్య (30) తాజాగా డల్లాస్‌లో తాను వుంటున్న పేయింగ్ గెస్ట్ హౌజ్‌లో శవమై కనిపించారు. అమెరికాలోని ఓ మల్టీనేషనల్ కంపెనీలో ఓ ప్రాజెక్టు పనిచేస్తోన్న వెంకన్నగారి కృష్ణ చైతన్య శ్ డల్లాస్‌లోని ఆర్లింగ్టన్‌లో పేయింగ్ గెస్ట్‌గా వుంటున్నారు. శుక్రవారం మొత్తం కృష్ణ చైతన్య తన గదిలోంచి బయటికి రాకపోవడంతో అనుమానం వచ్చిన ఆ పేయింగ్ గెస్ట్ హౌజ్ యజమాని పోలీసులకి సమాచారం అందించాడు. కృష్ణ చైతన్య వుంటున్న గది తలుపులు బద్ధలు కొట్టి లోపలికి వెళ్లిన పోలీసులకు అక్కడ అతడు తన బెడ్‌పై శవమై కనిపించాడు.
డల్లాస్ నుంచి ఈ దుర్వార్త అందుకున్న కృష్ణ చైతన్య తల్లిదండ్రులు సహాయం కోసం స్థానిక ఎంఎల్ఏ టి హరీష్ రావుని ఆశ్రయించారు. మృతుడి తల్లిదండ్రుల ఆవేదన అర్థం చేసుకున్న హరీష్ రావు.. వెంటనే మృతదేహాన్ని ఇండియాకు తీసుకువచ్చే ఏర్పాట్లు చేయాల్సిందిగా కోరుతూ హ్యూస్టన్‌లో వున్న ఇండియన్ కాన్సూల్ జనరల్ అధికారులకి, భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారులకి విడివిడిగా లేఖలు రాశారు.
కృష్ణ చైతన్య తండ్రి శ్రీనివాసులు బ్యాంకులో సీనియర్ అధికారి. ఉపాధి కోసం మూడేళ్ల క్రితం అమెరికా వెళ్లిన కృష్ణ చైతన్య ఇలా శవమై తిరిగిరానుండటం శ్రీనివాసులు దంపతులని తీవ్ర మనోవేదనకు గురిచేస్తోంది.