మెగాస్టార్ చిరంజీవి జీవితాన్ని మలుపు తిప్పిన `ఖైదీ` చిత్రానికి 35 ఏళ్లు
ఇప్పటికీ, ఎప్పటికీ ఖైదీ సినిమా తనకు ఎంతో ప్రత్యేకం అంటారు మెగాస్టార్. ఖైదీ లేని కెరీర్‌ను ఊహించుకోలేనని ఎన్నోసార్లు ప్రకటించారు. ఈ సినిమా పై ఇష్టంతో తన వందో సినిమాకు ఖైదీ నంబర్-786 అనే టైటిల్‌ను, 150వ సినిమాకు ఖైదీ నంబర్-150 అనే టైటిల్స్ పెట్టుకున్నారు చిరంజీవి.
"ఖైదీ" చిత్రంలోని "రగులుతోంది మొగలి పొద" సాంగ్ ఆంధ్రదేశాన్ని ఒక్క ఊపు ఊపిన గీతం. ఈ గీతానికి సలీం, తార నాట్యరీతులు సమకూర్చారు. నాగిని స్టైల్‌లో సాగిన ఈ గీతం ఇప్పటికీ అభిమానులు గుర్తుంచుకోదగ్గ మేటి గీతం.
ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన ఎ.కోదండరామిరెడ్డి చిరంజీవితో మరెన్నో హిట్ చిత్రాలకూ డైరెక్షన్ వహించారు. అందులో అభిలాష, గూండా, ఛాలెంజ్, రాక్షసుడు, దొంగ, పసివాడి ప్రాణం, అత్తకు యముడు అమ్మాయికి మొగుడు, ముఠామేస్త్రీ చిత్రాలు చెప్పుకోదగ్గవి.
"ఖైదీ" చిత్రం గురించి ముఖ్యంగా చెప్పుకోవాల్సినవి యాక్షన్ సన్నివేశాలు. అలాగే లోక్ సింగ్ సినిమాటోగ్రఫీ కూడా సినిమాకు ప్లస్ అయ్యింది.
విడుదలైన మొదటి రోజు నుంచే హిట్ టాక్ తెచ్చుకున్న ఖైదీ సినిమా విజయవాడ, హైదరాబాద్‌లోని 2 థియేటర్లలో ఏకంగా 365 రోజులాడి రికార్డు సృష్టించింది.
"ఖైదీ" చిత్రం తెలుగులో సూపర్ హిట్ అయ్యాక హిందీలో జితేంద్రతో, కన్నడంలో విష్ణువర్ధన్‌తో రీమేక్ చేశారు.
1982లో సిల్వెస్టరు స్టాలోన్ చిత్రం "ఫస్ట్ బ్లడ్" విడుదలయ్యింది. ఆ సినిమా ప్రభావం కొంతవరకు "ఖైదీ" పై ఉందని సినిమా క్రిటిక్స్ చెబుతూ ఉంటారు.
చిరంజీవిని అగ్రనటునిగా, కోదండరామిరెడ్డిని గురువుకి తగ్గ శిష్యునిగా, పరుచూరి బ్రదర్స్‌ను ప్రముఖ రచయితలుగా నిలిపిన చిత్రం "ఖైదీ"
ఖైదీ.. చిరంజీవి కెరీర్‌ను మలుపుతిప్పిన చిత్రం. మెగాస్టార్ ఇమేజ్‌కు పునాదిరాళ్లు వేసిన చిత్రం. చిరంజీవిని మాస్ హీరోగా మలిచిన మొదటి చిత్రం. ఇలా చెప్పుకుంటూ పోతే ఖైదీ గురించి ఎన్నో విశేషాలు.