Ankapur Chicken: అంకాపూర్ చికెన్ తినాలంటే.. అక్కడికే వెళ్లాల్సిన అవసరం లేదు.. ఈ ప్రాంతంలో అంతకు మించిన రుచి.. ఎక్కడంటే?
Ankapur Ruchulu: తెలంగాణలో ఫేమస్ చికెన్ కర్రీ ఏదైనా ఉందంటే ముందుగా గుర్తొచ్చేది అంకాపూర్ చికెన్. అయితే ఈ చికెన్ కర్రీ కేవలం తెలంగాణలో మాత్రమే కాదు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇప్పుడు చాలా ఫేమస్ అయ్యింది. తెలుగు రాష్ట్రాల్లో చికెన్ తో తయారుచేసే టాప్ ఫైవ్ కర్రీస్ గురించి చెప్పాల్సి వస్తే అంకాపూర్ చికెన్ కు కచ్చితంగా మొదటి స్థానం లభిస్తుంది. ఈ చికెన్ కర్రీని పూర్తి విలేజ్ స్టైల్ లో వండుతారు అందుకే దీనికి అలాంటి ఆ రుచి వస్తుంది.
నిజామాబాద్ జిల్లా అంకాపూర్ కు చెందిన నాటుకోడి కూర తినేందుకు దేశ విదేశాల్లో కూడా ఫ్యాన్స్ ఉన్నారు. అంకాపూర్ చికెన్ ప్రస్తుతం హైదరాబాదులో కూడా లభిస్తోంది. ఇందుకోసం ప్రత్యేకంగా రెస్టారెంట్లు సైతం తెరిచారు అయితే హైదరాబాదులోని ఒక ప్రదేశంలో మాత్రం ప్రత్యేకంగా అంకాపూర్ చికెన్ వండి వడ్డిస్తున్నారు.
ముఖ్యంగా సికింద్రాబాద్ ప్రాంతంలోని ఓల్డ్ బోయిన్ పల్లి సమీపంలో కొన్ని కుటుంబాలు ఈ అంకాపూర్ చికెన్ హోటల్స్ తెరిచి జంట నగరాల వాసులకు ప్రత్యేకంగా రుచి చూపిస్తున్నారు. అయితే రెస్టారెంట్లకు భిన్నంగా వీరు స్ట్రీట్ ఫుడ్ తరహాలో అంకాపూర్ చికెన్ వడ్డిస్తున్నారు. దీనికి ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది అంటే ఆశ్చర్యం కాదు.
ఎందుకంటే అంకాపూర్ చికెన్ తినేందుకు జంటనగరాల నలుమూలల నుంచి కూడా ఇక్కడికి పెద్ద ఎత్తున విచ్చేస్తుంటారు. నగరం నుంచి అంకాపూర్ వెళ్లి చికెన్ తినే బదులు కేవలం బోయిన్ పల్లి వెళ్లి అంకాపూర్ రుచిని పొందవచ్చని నిర్వాహకులు చెప్తున్నారు.
ఇక్కడ ప్రత్యేకంగా చికెన్ తో చేసే ములక్కాడల పులుసు చాలా ఫేమస్. అది కూడా చాలా తక్కువ ధరలోనే లభిస్తుండటం ఆశ్చర్యకరం అనే చెప్పాలి. కేవలం 150 రూపాయలు నుంచి ప్రారంభమయ్యే ఇక్కడ చికెన్ కర్రీ ఇద్దరికి సరిగ్గా సరిపోతుంది.
అంకాపూర్ చికెన్ తయారీ కోసం వీరు ప్రత్యేకంగా కరీంనగర్, వరంగల్ నుంచి నాటు కోళ్లను తెప్పించి వండుతున్నామని నిర్వాహకులు చెప్తున్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు అందుబాటులో ఉండే ఈ స్ట్రీట్ ఫుడ్ సెంటర్లకు పెద్ద ఎత్తున జనం తరలివస్తున్నారు. అంతేకాదు వీరికి పార్సిల్ల తాకిడి కూడా ఎక్కువగానే ఉంది.
ఇన్ని రోజులు అంకాపూర్ చికెన్ కోసం పెద్దపెద్ద రెస్టారెంట్లకు వెళ్లాల్సి వచ్చేది అక్కడ కూడా రుచి లభించేది కాదు. కానీ అంకాపూర్ చికెన్ ప్రస్తుతం స్ట్రీట్ ఫుడ్ తరహాలో లభించడంతో జంట నగరాల వాసులు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండానే వీరి వ్యాపారం జోరుగా సాగుతోంది. అంకాపూర్ చికెన్ వ్యాపారులు హైదరాబాద్ లో సెటిల్ అయ్యి ఈ వ్యాపారాన్ని ప్రారంభించినట్లు తెలుస్తోంది. వీరు పార్టీలు ఫంక్షన్లకు కూడా చికెన్ సప్లై చేస్తున్నారు.