ఏపీలో 74వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో జాతీయ జెండా ఆవిష్కరించిన సీఎం వైఎస్ జగన్ - ఫోటో గ్యాలరీ
పిల్లల ఎదుగుదల, ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రత్యేకమైన మెనూతో గోరుముద్ద పథకం అమలు చేస్తున్నామని, కంటి వెలుగు కార్యక్రమం ద్వారా విద్యార్ధులకు కంటి పరీక్షలు చేస్తున్నామని సీఎం జగన్ తెలిపారు. రైతు భరోసా ద్వారా రైతన్నలకు ఆర్ధిక సహాయం అందిస్తున్నాం. పేదలకు 30 లక్షల ఇళ్ల పట్టాలు అందిస్తున్నామని సీఎం జగన్ ప్రకటించారు.
రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేసేందుకే పాలనా వికేంద్రీకరణ కోసం మూడు రాజధానుల బిల్లుకు చట్టరూపం కల్పించామని చెప్పిన సీఎం జగన్.. విశాఖ కేంద్రంగా త్వరలోనే కార్యనిర్వాహక రాజధాని, కర్నూలు కేంద్రంగా న్యాయ రాజధాని ఏర్పాటు చేయనున్నట్టు స్పష్టంచేశారు.
CM YS Jagan speech highlights సీఎం జగన్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు : అందరికీ సమానమైన ఆర్థిక స్వేచ్ఛ కోసమే రైతు భరోసా, వైఎస్ఆర్ చేయూత, అమ్మఒడి, ఆసరా పథకాలు ప్రవేశపెట్టామని సీఎం జగన్ తెలిపారు. కులం, మతం, పార్టీలకు అతీతంగా అర్హులైన ప్రతీ ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నాం. ఆర్ధిక పరిస్థితులు సహకరించకున్నా సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేయడంలో రాజీపడటం లేదు. నిరుపేదలకు ఖరీదైన విద్యను ఉచితంగా అందించడం కోసమే ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టాం. 100 శాతం ఫీజు రీయింబర్స్‌మెంట్ అమలు చేస్తున్నామని సీఎం జగన్ పేర్కొన్నారు.
సాయుధ దళాల నుంచి గౌరవ వందనం స్వీకరిస్తున్న ఏపీ సీఎం వైఎస్ జగన్
స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. ''స్వాతంత్ర్య సమరయోధులకు పాదాభివందనాలు తెలియజేశారు. స్వాతంత్ర్యం ప్రాణవాయువు లాంటిదని గాంధీజీ చెప్పిన మాటలను సీఎం జగన్ గుర్తుచేశారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల ప్రత్యేకతలను ప్రతిబింభించేలా ఏర్పాటు చేసిన శకటాలతో పాటు కరోనావైరస్ ( Coronavirus ) వ్యాపిస్తున్న ప్రస్తుత తరుణంలో వైద్య, ఆరోగ్య శాఖ సిబ్బంది అందించిన సేవలకు గుర్తింపుగా ఏర్పాటు చేసిన శకటాలు ఈ వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు సీఎం జగన్ 74వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. పరేడ్‌లో సాయుధ దళాల నుండి సీఎం జగన్ గౌరవ వందనం స్వీకరించిన అనంతరం ప్రత్యేకంగా అలంకరించిన వాహనంపై ప్రభుత్వ సంక్షేమ పథకాల శకటాలను సందర్శించారు.