Balakrishna: రంగ రంగ వైభవంగా బాలకృష్ణ సినీ స్వర్ణోత్సవ వేడుకలు.. దిగివచ్చిన సినీ తారలు..
తాతమ్మకల సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన హీరో నందమూరి బాలకృష్ణ. పరిచయమైంది సీనియర్ ఎన్టీఆర్ కుమారుడిగా అయినా.. తనకంటూ సొంత పేరు తెచ్చుకున్నారు. తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎన్నో బ్లాక్ బస్టర్ విజయాలు అందించిన ఈ లెజెండ్.. ఈ సంవత్సరం తో సినీ రంగంలో 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు.
ఈ క్రమంలో తాజాగా సినీ సభ్యులందరూ.. నందమూరి బాలకృష్ణ కి రంగ రంగ వైభవంగా.. స్వర్ణోత్సవ వేడుకను జరిపారు. ఈ వేడుకకు సినీ తారలు అందరూ దిగి వచ్చారు. తెలుగు చలన చిత్ర పరిశ్రమ హైదరాబాద్‌లో ఆదివారం.. సెప్టెంబర్ 1న.. భారీ స్థాయిలో ఈ ఈవెంట్ ని జరిపారు.
టాలీవుడ్ సెలబ్రిటీస్ తో పాటు.. ఇతర సినీ పరిశ్రమల నటినటులు, రాజకీయ ప్రముఖులు ఈ వేడుకకు తరలివచ్చారు. బాలకృష్ణతో సినిమాలు చేసిన ఎంతోమందిదర్శకులతో పాటు సినీ హీరోలు చిరంజీవి, వెంకటేశ్, నాని, విజయ్ దేవరకొండ, ఉపేంద్ర, గోపీచంద్, శ్రీకాంత్, రానా, శివ రాజ్‌కుమార్, సిద్దు జొన్నలగడ్డ, అల్లరి నరేష్, నిర్మాతలు జెమినీ కిరణ్, డి సురేష్ బాబు.. హీరోయిన్స్ సుమలత, సుహాసిని, ఇంద్రజ, మాలశ్రీ, తదితరులు ఈవెంట్‌లో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో.. అలనాటి రెబల్ స్టార్ దివంగత కృష్ణంరాజు.. సతీమణి శ్యామలా దేవి.. నందమూరి బాలకృష్ణను శాలువాతో సత్కరించారు. ఇక వీరందరితో పాటు బాలకృష్ణ కుటుంబ సభ్యులకు కూడా ఈ వేడుకకు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో ఈ ఈవెంట్ కి విచ్చేసిన అతిథులు అందరూ స్టేజిపై మాట్లాడుతూ.. బాలకృష్ణకు శుభాకాంక్షలు తెలిపారు.
ముఖ్యంగా ఈ ఈవెంట్ లో ‘వీరసింహారెడ్డి’ సినిమాలోని ‘జై బాలయ్య’ సాంగ్ కి దర్శకుడు రాఘవేంద్రరావు ఓ స్టెప్పు వేసి.. అతిథులను అలరించారు. ఇక ఈ వేడుకకు వచ్చిన అతిథులను చిరంజీవితో కలిసి బాలకృష్ణ పలకరించడం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఈ ఈవెంట్ లో బాలకృష్ణ మాట్లాడుతూ..’ క్రమశిక్షణ, సంస్కారం అనేది సినీ పరిశ్రమలో ఎంతో ప్రధానమైనవి. అక్కినేని నాగేశ్వరరావు గారు దగ్గర నుండి అదే నేర్చుకున్నాను. మేము అందరం సినీ పరిశ్రమలో పోటీగా నటిస్తూ ఉన్నప్పటికీ ఒక ఆరోగ్య పరమైన పోటీ మాత్రమే ఉంటుంది. నేను చేసే ప్రతి పనిలో.. నాకు అండగా ఉంటున్న నా భార్య వసుంధరకు ధన్యవాదాలు" అని అన్నారు.