Modi Chandrbabu: బడ్జెట్‌లో ఏపీకి భారీ కేటాయింపులు.. ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు

దేశ రాజధాని ఢిల్లీలో టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు బిజీబిజీగా గడిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో దాదాపు గంటకు పైన చంద్రబాబు భేటీ అయ్యారు. రాష్ట్ర అంశాలతోపాటు రాజకీయ పరిణామాలపై చర్చించినట్లు సమాచారం.

రాష్ట్ర పరిస్థితులు, ఏపీ అభివృద్ధికి సహకారం వంటి అంశాలను ప్రధాని దృష్టికి సీఎం చంద్రబాబు తీసుకెళ్లారు.

ఫిబ్రవరి 1వ తేదీన ప్రవేశపెట్టనున్న కేంద్ర వార్షిక బడ్జెట్‌లో రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన అంశాలు.. కేంద్ర ప్రభుత్వ పథకాలకు రాష్ట్ర ప్రభుత్వ వాటా, నిధుల కేటాయింపులపై ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు చర్చించారు.
అమరావతి నిర్మాణానికి గత మధ్యంతర బడ్జెట్ లో ప్రతిపాదించిన రూ.15 వేల కోట్ల ఆర్ధిక సాయాన్ని వేగవంతం చేయాలని ప్రధాని సీఎం చంద్రబాబు విజ్ఞప్తి చేశారు.
వైజాగ్ రైల్వే జోన్ శంకుస్థాపనకు రావాలని ఈ సందర్భంగా ప్రధాని మోదీని చంద్రబాబు ఆహ్వానించినట్లు సీఎం కార్యాలయ వర్గాలు వెల్లడించాయి.
పోలవరం నిర్మాణానికి సహకారం, వరద సెస్‌కు అనుమతి ఇవ్వాలని ప్రధాని మోదీని సీఎం చంద్రబాబు కోరారు.
ప్రధాని మోదీతో భేటీకి ముందు ఢిల్లీలో మాజీ ప్రధాని అటల్ బిహార్ వాజ్‌పేయికి నివాళులర్పించడంతోపాటు ఎన్డీయే పక్ష సమావేశంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అయ్యి రాష్ట్రానికి సంబంధించిన విజ్ఞప్తులు చేశారు.