Cm Revanth reddy: వరదల్లో చనిపోయిన వారికి 5 లక్షల ఎక్స్ గ్రేషియా.. కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు..
తెలంగాణలో వరుణుడు తన ప్రతాపం చూపించాడు. ఎడతెరిపిలేకుండా కురిసిన వర్షానికి జనజీవనమంతా అస్తవ్యస్తంగా మారిపోయింది. ఎక్కడ చూసిన వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. రోడ్లన్ని జలమయమైపోయాయి. అనేక కాలనీల్లో వరద నీళ్లు వచ్చి చేరిపోయాయి. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి సోమవారం నాడు కమాంట్ కంట్రోల్ సెంటర్ లో అత్యవసరంగా సమావేశం నిర్వహించారు.
కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో సమావేశం జరిగింది.ఈ కార్యక్రమానికి... మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, శ్రీధర్ బాబు, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి,డీజీపీ జితేందర్, వివిధ శాఖలకు చెదింన ఉన్నతాధికారులు హాజరయ్యారు.
రాష్ట్ర వ్యాప్తంగా భారీగా వర్షాలు, ప్రస్తుతంఉన్న పరిస్థిల గురించి అధికారులు సీఎంకు తెలిపారు. భారీ వర్షాలతో వాటిల్లిన నష్టం.. వరద సహాయక చర్యల పరిస్థితిపై సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో అత్యధికంగా ఖమ్మం జిల్లాల్లో వర్ష పాతం నమోదు అయిన విషయం తెలిసిందే. వర్షాలకు పలు నదులు, వాగులు, చెరువులు ఉదృతంగా ప్రవహిస్తున్నాయి. వర్షాల కారణంగా ఇప్పటి వరకు పది మంది మృతువాత పడ్డారు.
అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, సీపీలతో ఎప్పటికప్పుడు సీఎం మానిటరింగ్ చేస్తున్నారు. ఏజెన్సీ ప్రాంతంలోని ప్రజలకు మరింత అందుబాటులో ఉండాలని సూచించారు. వర్షాల వల్ల నీట మునిగిన పంట పొలాలపై కూడా రేవంత్ ఆరా తీశారు. అన్ని జిల్లాల నుంచి నిరంతరం కాల్ చేయడానికి సెక్రెటెరియట్ లో.. టోల్ ఫ్రీ నంబర్ 040 - 23454088 ఏర్పాటు చేశారు. వర్షాలు, వరదల కారణంగా పూర్తిగా దెబ్బతిన్న పంటలకు ఒక్కో ఎకరానికి రూ. 10 వేల చొప్పున పంట నష్ట పరిహరం అందించేందుకు తక్షణ ఏర్పాట్లు చేయలని ఆదేశించారు.
మరోవైపు.. తెలంగాణలో వరదల వల్ల చనిపోయిన వారి కుటుంబాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రూ.5 లక్షల ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. తీవ్ర వరద ముంపునకు గురైన ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, సూర్యాపేట జిల్లా కలెక్టర్లకు తక్షణ సాయం కింద రూ.5 కోట్లు మంజూరు చేశారు. చని పోయిన పాడి గేదెలు ఒక్కో దానికి ఇచ్చే ఆర్థిక సాయాన్ని రూ. 30 వేల నుంచి రూ. 50 వేలకు పెంచాలని, మరణించిన మేకలు, గొర్రెలకు ఒక్కోదానికి ఇచ్చే రూ. 3 వేల సాయం రూ.5 వేలకు పెంచాలని సీఎం ఆదేశించారు.
తెలంగాణలో భారీ వర్షాలు రాష్ట్రాన్ని అతలాకుతలం చేశాయి. శనివారం నుంచి ఆదివారం రాత్రి వరకు కురిసిన వర్షాలు జనజీవనాన్ని అస్తవ్యస్తం చేశాయి. వరద వల్ల రాష్ట్రంలో 15 మంది మరణించారు. ఈ నేపథ్యంలో వరదల కారణంగా చనిపోయిన వారి కుటుంబాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. ఈ క్రమంలో సీఎం రోడ్డు మార్గం ద్వారా ఖమ్మంకు వదరలను చూసేందుకు బయలు దేరారు.