Unstoppable Season 3 Guest: బాలకృష్ణ టాక్ షోకి రానున్న మొదటి గెస్ట్ ఎవరంటే..?
ఆహా డిజిటల్ ప్లాట్ ఫామ్ లోని అన్స్టాపబుల్ సెలబ్రిటీ టాక్ షో.. సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ లోని ఎంటర్టైన్మెంట్ యాంగిల్ ను బయటకు తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. అప్పటిదాకా బాలకృష్ణను తెరమీద హీరోగా మాత్రమే చూసిన ప్రేక్షకులు.. అన్స్టాపబుల్ టాక్ షో తో తెర వెనుక అలరించే బాలయ్యను చూశారు. షో కి వచ్చే సెలబ్రిటీలను పక్కన పెడితే.. బాలకృష్ణ కారణంగా షోకి మంచి రేటింగ్ వచ్చింది అని చెప్పుకోవచ్చు.
ఇప్పటికే విజయవంతంగా రెండు సీజన్లు పూర్తి చేసుకున్న అన్స్టాపబుల్ టాక్ షో ఇప్పుడు మూడవ సీజన్ కి రెడీ అవుతోంది. దీనికోసం అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక అతి త్వరలో మొదలు కాబోతున్న ఈ షోలో ఈ సీజన్లో.. ఏ సెలబ్రిటీలు గెస్ట్లుగా విచ్చేయబోతున్నారు అని.. సోషల్ మీడియాలో పెద్ద స్థాయిలో.. చర్చ మొదలైంది.
తాజా సమాచారం ప్రకారం.. అన్స్టాపబుల్ సీజన్ 3 మొదటి ఎపిసోడ్ కి గెస్ట్ గా ఒక ప్రముఖ మలయాళం హీరో రాబోతున్నట్లు తెలుస్తోంది. ఆ మలయాళం హీరో మరెవరో కాదు దుల్కర్ సల్మాన్. మలయాళం లో మాత్రమే కాక తెలుగులో కూడా తనకంటూ ఒక సెపరేట్ ఫ్యాన్ బేస్ సంపాదించుకున్న దుల్కర్ సల్మాన్.. వెంకీ అట్లూరి దర్శకత్వంలో నటించిన సినిమా లక్కీ భాస్కర్.
మంచి అంచనాల మధ్య లక్కీ భాస్కర్ సినిమా అక్టోబర్ 31న విడుదల కి రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్ లో భాగంగా.. చిత్ర బృందం అన్స్టాపబుల్ టాక్ షో కి విచ్చేయబోతున్నారు. తాజాగా ఈ ఎపిసోడ్ కి సంబంధించిన షూటింగ్ కూడా జరిగింది. బాలకృష్ణ, దుల్కర్ సల్మాన్ ల మధ్య జరిగే సంభాషణలు ఎలా ఉంటాయో అని.. ఇప్పటినుంచే సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. ఈ ఎపిసోడ్ కోసం ఫాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ప్రముఖ మలయాళం నటుడు మమ్ముట్టి తనయుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన దుల్కర్ సల్మాన్.. మలయాళం లో స్టార్ హీరోగా పేరు తెచ్చుకున్నారు. తెలుగులో కూడా దుల్కర్ సల్మాన్ కి ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తెలుగు డైరెక్టర్లతో సినిమాలు చేస్తూ.. టాలీవుడ్ ప్రేక్షకులను కూడా అలరిస్తున్న దుల్కర్ సల్మాన్.. లక్కీ భాస్కర్ సినిమాతో మరొకసారి తెలుగు ప్రేక్షకులను పలకరించనున్నారు. మీనాక్షి చౌదరి ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది.