EPFO Latest Updates: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అప్‌డేట్.. నెలకు రూ.9 వేలు గ్యారంటీ పెన్షన్.. కేంద్రానికి రిక్వెస్ట్..!
ఇటీవల చెన్నై ఈపీఎఫ్ పెన్షనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కనీస పెన్షన్ పెంపుపై కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రి మన్సుఖ్ మాండవియాకు లేఖ రాసింది. డీఏతోపాటు నెలవారీ కనీస పెన్షన్‌ను రూ.9 వేలకు పెంచాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది.
దాదాపు 75 లక్షల మంది పింఛన్‌దారులు ఈపీఎస్ పరిధిలో ఉన్నారని.. యూపీఎస్ తరహాలో గ్యారంటీ పెన్షన్ అందజేయాలని లేఖలో పేర్కొంది.
ఈ ఏడాది జూలైలో పెన్షనర్ల సంస్థ EPS- 95 జాతీయ ఆందోళన కమిటీ కనీస నెలవారీ పెన్షన్‌ను రూ.7,500కి పెంచాలని డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. ఈ కమిటీలో దాదాపు 78 లక్షల మంది రిటైర్డ్ పెన్షనర్లు, 7.5 కోట్ల మంది పారిశ్రామిక రంగంలో పనిచేస్తున్న ఉద్యోగులు ఉన్నారు.
ఉద్యోగుల పెన్షన్ స్కీమ్ (ఈపీఎస్ 1995 స్కీమ్) పరిధిలోకి వచ్చే పెన్షనర్లకు నెలకు రూ.1,000 కనీస పెన్షన్‌ను కేంద్రం 2014లో ప్రకటించింది. అయితే ఈపీఎస్-95 కింద ఇచ్చే పెన్షన్‌ను నెలకు రూ.2 వేలకి రెట్టింపు చేయాలని సిఫార్సు చేస్తూ కార్మిక మంత్రిత్వ శాఖ గతేడాది ఆర్థిక మంత్రిత్వ శాఖకు ప్రతిపాదన పంపింది. అయితే ఆర్థిక మంత్రిత్వ శాఖ ఈ ప్రతిపాదనను ఆమోదించలేదు.
ఏదైనా కంపెనీ లేదా సంఘటిత రంగంలో పనిచేసే ఉద్యోగుల బేసిక్ పేలో 12 శాతం పీఎఫ్ ఫండ్‌లో జమ అవుతుంది. అదే మొత్తంలో కంట్రిబ్యూషన్ కంపెనీ నుంచి PFకి వెళ్తుంది.
అయితే కంపెనీ సహకారం రెండు భాగాలుగా ఉంటుంది. ఇందులో 8.33 శాతం ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ (ఈపీఎస్) అంటే పెన్షన్ ఫండ్‌లో డిపాజిట్ అవుతుంది. 3.67 శాతం ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ అంటే ఈపీఎఫ్‌లో జమ అవుతుంది.
ఉదాహరణకు ప్రాథమిక జీతం రూ.10 వేలు అయితే.. కంపెనీ నుంచి 8.33 శాతం సహకారం అంటే రూ.833 కూడా ఉద్యోగి ఈపీఎస్ ఖాతాలో వసూలు అవుతుంది. ప్రతి సంవత్సరం జీతంలో 10 శాతం ఇంక్రిమెంట్ పొందితే.. కంపెనీ సహకారం కూడా పెరుగుతుంది.
ఈపీఎస్ కింద ఉద్యోగి పదవీ విరమణ తర్వాత పెన్షన్‌కు అర్హులు అవుతారు. పెన్షన్ పొందాలంటే ఒకే యూఎఎన్ కింద పదేళ్ల సర్వీస్ పూర్తి చేయాలి.