HBD YS Jagan Mohan Reddy: మొండోడే కాదు చాలా ఘటికుడే.. వైఎస్ జగన్ బర్త్ డే స్పెషల్

Sat, 21 Dec 2024-8:32 am,

2009లో నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి తనయుడిగా వైఎస్ జగన్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. కడప ఎంపీగా పోటీ చేసి.. భారీ విజయం సాధించి పార్లమెంట్‌లో అడుగుపెట్టారు.   

అయితే అదే ఏడాది సెప్టెంబర్ 2 వైఎస్సార్ మరణంతో జగన్‌కు కష్టాలు మొదలయ్యాయి. వైఎస్ జగన్‌ను సీఎం చేయాలని ఎమ్మెల్యేలందరూ సంతకాలు చేసి పంపించినా.. అధిష్టానం ఒప్పుకోలేదు. ఆ తరువాత జగన్ ఓదార్పు యాత్ర చేపట్టగా.. జనం నుంచి భారీ స్పందన వచ్చింది. అయితే కాంగ్రెస్‌ అధిష్టానం ఓదార్పు యాత్రను అడ్డుచెప్పింది.  

దీంతో కాంగ్రెస్‌తో విభేదించి బయటకు వచ్చి 2011సొంతంగా వైఎస్సార్సీపీని స్థాపించారు. తనతోపాటు వచ్చిన 17 మంది ఎమ్మెల్యేలను ఉప ఎన్నికల్లో మళ్లీ గెలిపించుకున్నారు. అప్పుడే దేశవ్యాప్తంగా జగన్ మోహన్ రెడ్డి పేరు మారుమోగిపోయింది.  

కానీ అప్పటి నుంచి రాజకీయంగా జగన్‌ను దెబ్బ తీసేందుకు కేసులు తెరపైకి తీసుకువచ్చారు. ఆయన ఆస్తులపై ఈడీ, సీబీఐ కేసులు నమోదు చేసి.. తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. వేరే వాళ్ల అయితే రాజకీయాలను వదిలేసి దూరంగా వెళ్లిపోయేవారు. కానీ అక్కడ ఉన్నది జగన్. మొండివాడు. ఎక్కడ వెనక్కి తగ్గకుండా ధైర్యంగా కేసులు ఎదుర్కొన్నారు.  

అక్రమాస్తుల కేసులో అరెస్ట్ అయి.. 16 నెలలు జైలులో ఉన్నారు. బెయిల్ కోసం ఎన్నిసార్లు దరఖాస్తు చేసుకున్నా.. తిరస్కరణకు గురైంది. ఆయనకు అండగా తల్లి విజయమ్మ, చెల్లెలు వైఎస్ షర్మిల, భార్య భారతి అండగా నిలిచారు. బెయిల్‌పై విడుదలై బయటకు వచ్చారు. 2014 ఎన్నికల్లో కచ్చితంగా జగన్ విజయం సాధిస్తారని అందరూ అనుకున్నారు.  

అయితే దేశవ్యాప్తంగా అప్పటికే క్రేజ్‌ ఉన్న ప్రధాని మోదీతో చంద్రబాబు జత కలవడం.. అప్పుడే జనసేన పార్టీ స్థాపించిన పవన్ కళ్యాణ్‌ వీరికి సపోర్ట్ చేయడంతో జగన్‌ అప్పుడు అధికారానికి దూరమయ్యారు. ప్రతిపక్షనేతగా ఐదేళ్లు ప్రభుత్వంపై పోరాడారు.   

2019 ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ప్రశాంత్ కిశోర్ టీమ్‌ సలహాలు తీసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేపట్టి జనాల్లోకి దూసుకువెళ్లారు. ఇడుపులపాయ నుంచి మొదలుపెట్టి.. ఇచ్ఛాపురం వరకు 3648 కి.మీ. నడిచి.. దాదాపు 2 కోట్ల మందిని కలిశారు. 2019 ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి నుంచి వీడిపోయి సొంతంగా పోటీ చేశాయి.   

ప్రజలు వైఎస్సార్సీపీకి పట్టం కట్టారు. దేశవ్యాప్తంగా మారుమోగిపోయేలా ఏకంగా 151 సీట్లు సాధించారు. 2019 మే 30న ఏపీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. నవరత్నాలు అమలుతోపాటు అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి తండ్రి బాటలోనే పయనించారు.  

అయితే మూడు రాజధానులు అంటూ ఐదేళ్లు స్థిరమైన రాజధాని లేకపోవడం.. పెట్టుబడుల పెట్టేందుకు కంపెనీలు వెనక్కి తగ్గడం.. ప్రభుత్వ ఉద్యోగుల నుంచి వ్యతిరేకత.. మోదీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మరోసారి కూటమిగా ఏర్పడడంతో జగన్‌కు ఓటమి తప్పలేదు.   

2019 ఎన్నికల్లో రికార్డుస్థాయిలో విజయం సాధించిన జగన్‌కు.. 2024 ఎన్నికల్లో అదేస్థాయి చెత్త రికార్డుతో దారుణంగా ఓటమిపాలయ్యారు. 151 సీట్ల నుంచి కేవలం 11 సీట్లకే పరిమితమయ్యారు. దీంతో ముఖ్యమంత్రి నుంచి ప్రతిపక్ష నేతగా కూడా అర్హత సాధించలేకపోయారు.   

జగన్ ఇప్పుడు దారుణంగా ఓడిపోయాడని తక్కువ అంచనా వేయడానికి వీలులేదు. "గాయపడిన సింహం నుంచి వచ్చే శ్వాస గర్జన కంటే భయకంరంగా ఉంటాదని అంటారు. తమ అధినేత కూడా రెండింతల ఉత్సాహంతో కచ్చితంగా పుంజుకుంటారు.." అంటూ ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.   

వైసీపీ నుంచి సీనియర్ నాయకులు ఒక్కొక్కరు వెళ్లిపోతున్నా.. రాజకీయంగా జగన్ మళ్లీ యాక్టివ్ అవుతున్నారు. తన వ్యూహ రచనలకు పదునుపెడుతున్నారు.   

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link