Gold Rate: పెరుగుట విరుగట కొరకే..మళ్లీ పెరిగిన బంగారం ధర..తులం ఎంత పెరిగిందంటే?
Gold Rate Today: దేశంలో బంగారం ధరలు గత రెండు వారాల్లో భారీగా తగ్గాయి. ఎవరూ ఊహించని విధంగా పసిడి ధరలు నేలచూపులు చూశాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయంతో ఆ దేశ కరెన్సీ డాలర్ పుంజుకుంది. దీంతో బంగారం నుంచి పెట్టుబడులు ఇతర మార్గాలకు వెళ్లడంతో బంగారం ధరలు భారీగా తగ్గాయి. ఈ నవంబర్ నెల ప్రారంభం నుంచే గోల్డ్ ధరలు ఏకంగా 6శాతం మేర పడిపోయాయి.
ఎంసీఎక్స్ మార్కెట్లో తులం బంగారం ధర ఏకంగా రూ. 6వేల మేర పడిపోయింది. దేశీయంగా కొనుగోళ్లు బాగానే ఉన్నప్పటికీ ధరలు పడిపోతుండటం గమనార్హం. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ కొనసాగుతుండటం..ఈ డిమాండ్ ఉన్న సమయంలో బంగారం ధరలు పడిపోతూ భారీ ఊరట కల్పిస్తున్నాయి. ఈ క్రమంలోనే హైదరాబాద్ బులియన్ మార్కెట్లో నవంబర్ 19వ తేదీన బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.
అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు భారీగానే దిగివచ్చినప్పటికీ మంగళవారం స్వల్పంగా పెరిగింది. డాలర్ పుంజుకోవడం, అమెరికాలో ద్రవ్యోల్బణం పెరగడం వంటి కారణాలతో అది బంగారం ధరలపై ప్రతికూల ప్రభావం చూపిస్తోంది. దీంతో బంగారం ధరలు భారీగా దిగివచ్చాయి.
నేడు నవంబర్ 19వ తేదీ బంగారం ధర ఒక ఔన్సుకు 2563 డాలర్ల దగ్గర కొనసాగుతోంది. ఇక స్పాల్ సిల్వర్ ధర ఒక ఔన్సుకు 30.27 డాలర్లు ఉంది. ఇండియా కరెన్సీ రూపాయి మారకం విలువ స్వల్పంగా కోలుకుంది. డాలర్ తో పోల్చితే నేడు రూ. 84,424 దగ్గర ట్రేడ్ అవుతోంది.
ఇక హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు దీపావళి నుంచి వరుసగా పడిపోతూ వచ్చాయి. మధ్య మధ్యలో స్వల్పంగా పెరిగాయి. దీంతో రెండు వారాల్లో బంగారం ధరలు భారీగా పడిపోయాయి.
అయితే నేడు నవంబర్ 19వ తేదీన 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 100 మేర పెరిగింది. దీంతో తులం ధర రూ. 69, 450కి పెరిగింది. 24 క్యారెట్ల బంగారం ధర తులంపై రూ. 110 పెరగడంతో రూ. 75,750కి చేరింది.
ఇక బంగారం ధరలు స్వల్పంగా పెరిగినప్పటికీ వెండి రెండు రోజులుగా స్థిరంగానే కొనసాగుతోంది. ప్రస్తుతం వెండి కిలో లక్ష రూపాయలకు దిగువన ట్రేడింగ్ అవుతోంది. నేడు హైదరాబాద్ మార్కెట్లో వెండి కిలో ధర రూ. 99 వేల మార్క్ వద్ద స్థిరంగా అమ్ముడవుతోంది.
అయినప్పటికీ మూడేళ్ల కనిష్ట స్థాయికి ధరలు దిగివచ్చాయి. దీంతో కొనుగోలు చేసేందుకు ఇదే మంచి సమయంగా బులియన్ మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ప్రాంతాలను బట్టి ధరలు కూడా మారుతుంటాయి.