PM Surya Ghar Yojana: ప్రధానమంత్రి కొత్త పథకం.. కరెంట్ బిల్లు నుంచి విముక్తి
ఈ మధ్యకాలంలో కరెంట్ బిల్లులు ఏ విధంగా పెరిగిపోతున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బిల్లు కట్టలేక చాలామంది అవస్థలు పడుతున్నారు. జీతం తక్కువ, ఖర్చులు ఎక్కువ అన్నట్టుగా ప్రజల పరిస్థితి మారిపోయింది. చాలీచాలని జీతంతో పెరుగుతున్న ఖర్చుల కారణంగా తగ్గించుకుందామనుకున్నా.. తగ్గని పరిస్థితుల్లో ప్రజలు అవస్థలు పడుతున్నారు. ముఖ్యంగా ప్రతి నెల ఒకటో తారీకు వచ్చిందంటే చాలు కరెంట్ బిల్లు కట్టాలని భయపడిపోతున్నారు.
ప్రతి నెల ఎంత మీటర్ తిరుగుతోంది..?ఎంత బిల్లు వస్తుంది..? అనే ఆందోళన ఎక్కువవుతుంది. అయితే ఇప్పుడు ఆ సమస్యలన్నింటినీ తగ్గించడానికి ప్రధానమంత్రి సూర్య ఘర్ యోజన అనే పథకాన్ని కేంద్ర ప్రభుత్వం అమలులోకి తీసుకొచ్చింది.
ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన 2023 సంవత్సరంలో ప్రారంభించబడింది. దీని కింద దాదాపు కోటి కుటుంబాలకు సోలార్ రూఫ్ టాప్ ఏర్పాటు చేయాలని లక్ష్యంగా ప్రభుత్వం పెట్టుకుంది కూడా. సోలార్ రూఫ్ టాప్ లను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం రాయితీ కూడా ఇస్తోంది.
ఈ పథకం కింద ఏర్పాటు చేసిన సోలార్ ప్యానల్ వల్ల స్థానికులకు విద్యుత్ బిల్లు నుంచి విముక్తి లభిస్తుంది. ఒకప్పుడు రూ.10 నుంచి రూ.14 వేల వరకు కరెంట్ బిల్లులు కట్టే, ఆ కుటుంబాలు ఇప్పుడు జీరో గా మారాయి అంటే అతిశయోక్తి కాదు.
ఇదే విషయంపై డాక్టర్ గుంజన్ బద్రకియా మాట్లాడుతూ నా ఇంటి వద్ద సోలార్ ప్యానల్ అమర్చుకున్నాను. ఆ తర్వాత కరెంట్ బిల్లు భారీగా తగ్గిపోయింది. ఒకప్పుడు నేను రూ .13 వేల వరకు విద్యుత్ బిల్లు కట్టేవాడిని. కాకపోతే ప్రస్తుతం ఆ బిల్లు కేవలం రూ.900 మాత్రమే అయింది. అంటూ తన అనుభవాన్ని చెప్పుకొచ్చారు. ఆరు నెలల క్రితం సోలార్ ప్యానల్స్ అమర్చిన తర్వాత ఈ మార్పు వచ్చిందని, దీనివల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని, తనకు ఆర్థిక ఇబ్బందులు పూర్తిగా తగ్గిపోయాయని కూడా ఆ డాక్టర్ వెల్లడించారు.
ఇకపోతే ప్రధానమంత్రి సూర్య ఘర్ యోజన కింద ఇంటికి సోలార్ ప్యానల్స్ అమర్చిన తర్వాత ఇంటి విద్యుత్ బిల్లు ఘననీయంగా తగ్గిందని కేతుల్ వినాయకన్ కూడా తెలిపారు.
అంతేకాదు ఇక్కడ మరొక మహిళ మాట్లాడుతూ.. సోలార్ ప్యానల్స్ ను మేము కూడా మా ఇంటి రూఫ్ టాప్ పైన అమర్చాము. గతంలో రూ.15 వేల వరకు మేము బిల్లు చెల్లించే వాళ్ళం. కానీ ఇప్పుడు ఆ బిల్లు దాదాపు తగ్గిపోయింది అంటూ ఆమె తెలిపింది. అంతేకాదు ప్రతి ఒక్కరు కూడా తమ ఇళ్లల్లో వీటిని ఏర్పాటు చేసుకోవాలని భావిస్తున్నారు.