Flag Hoist on Red Fort: పంద్రాగస్టున ఎర్రకోటపైనే జెండా ఎందుకు ఎగురవేస్తారు, ప్రాధాన్యత ఏంటి

Sun, 11 Aug 2024-10:56 am,

ప్రతి ఏటా ఆగస్టు 15వ తేదీన స్వాతంత్య్ర దినోత్సవం పురస్కరించుకుని ప్రదాన మంత్రి ఎర్రకోటపై జాతీయ పతాకాన్ని ఎగురవేస్తారు. మోదీ 11వ సారి జాతీయ పతాకం ఎగురవేయనున్నారు. అంతకుముందు మన్మోహన్ సింగ్ 10 సార్లు జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. కానీ ఇప్పటివరకూ అత్యధిక సార్లు జెండా ఎగురవేసిన ప్రధానిగా జవహర్ లాల్ నెహ్రూ 17 సార్లు రికార్డు ఉంది.

ఎర్రకోటతో భారతదేశ చరిత్రకు చాలా సంబంధముంది. 1857 సిపాయిల తిరుగుబాటుతో స్వాతంత్ర్య సమరం మొదలైంది. మీరట్‌లో తిరుగుబాటు ప్రారంభమైనప్పుడు అక్కడి సిపాయిలు ఢిల్లీకు చేరుకుని ఎర్రకోట సాక్షిగా బహదూర్ షా 2ను భారతదేశ చక్రవర్తిగా ప్రకటించారు. ఇతడి నేతృత్వంలోనే యోధులంతా ఒక్కటిగా నడిచారు

సిపాయిల తిరుగుబాటు అనంతరం బ్రిటీషు సైన్యం ఈ కోటను స్వాధీనం చేసుకుంది. నివాస రాజభవనాలను నాశనం చేసింది. అప్పట్నించి బ్రిటీష్ ఇండియా ఆర్మీకు ఎర్రకోట స్థావరమైంది. ఆ తరువాత బహదూర్ షా జాఫర్‌పై ఎర్రకోటలో విచారణ జరిగింది. 1947లో స్వాతంత్ర్యం తరువాత ఈ కోట భారతదేశ ఆధీనంలో వచ్చింది. 

1947 ఆగస్టు 15వ తేదీన అప్పటి ప్రధానిగా జవహర్ లాల్ నెహ్రూ తొలిసారిగా జాతీయ పతాకాన్ని ఎర్రకోటపై ఎగురవేసి ప్రసంగించారు. అప్పటి నుంచి ఈ పద్ధతి కొనసాగుతోంది. దేశ రాజధానిలో ఠీవిగా నిలబడిన కోట కావడంతో జెండా ఎగురవేతకు అనుకూలంగా ఉంది.

క్రీస్తుశకం 1639లో దేశ రాజధానిని ఆగ్రా నుంచి ఢిల్లీకు మార్చినప్పుడు అప్పటి మొఘల్ చక్రవర్తి షాజహాన్ ఎర్రకోటను నిర్మించాడు. ఎర్రటి ఇసుకరాయితో నిర్మించింది కావడంతో ఎర్రకోటగా పిలుస్తారు. మొఘల్స్ పాలనలో ఇదే అతిపెద్ద రాజకీయ పరిపాలనా కేంద్రం. ఇప్పుడు ప్రముఖ పర్యాటక ప్రాంతంగా ఉంది. 

అనంతరకాలంలో ఎర్రకోటను యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది. తాజ్‌మహల్ డిజైన్ చేసిన ఉస్తాద్ అహ్మద్ లాహౌరినే ఈ కోటను డిజైన్ చేశారు. 

ఎర్రకోటలో స్వాతంత్య్ర దినోత్సవం రోజున 21 తొపాకుల వందనం, జాతీయ గీతాలాపన జరుగుతుంది. తరువాత ప్రధాని ప్రసంగం ఉంటుంది. ఆ తరువాత స్వాతంత్య్ర పోరాటంలో ప్రాణత్యాగం చేసిన యోధులకు నివాళులు అర్పిస్తారు. అన్నింటికంటే ప్రత్యేకం ఆ రోజున జరిగే సైనిక కవాతు. వైమానిక ప్రదర్శన.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link