IPL 2023 Updates: ఐపీఎల్ చరిత్రలో అత్యధికసార్లు డకౌట్ అయిన ఆటగాళ్లు వీళ్లే..
మన్‌దీప్ సింగ్ ఐపీఎల్‌లో అందరి కంటే ఎక్కువసార్లు డకౌట్ అయిన ప్లేయర్‌గా నిలిచాడు. ఢిల్లీ క్యాపిటల్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్, కోల్‌కతా నైట్ రైడర్స్, పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజీల తరపున మొత్తం 110 మ్యాచ్‌లు ఆడాడు. వీటిలో 15 సార్లు డకౌట్ అయ్యాడు.
ఆర్‌సీబీ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ దినేష్ కార్తీక్ కూడా ఐపీఎల్‌లో 14సార్లు ఖాతా తెరవకుండానే పెవిలియన్‌కు చేరుకున్నాడు. గతంలో ఢిల్లీ డేర్‌డెవిల్స్, గుజరాత్ లయన్స్, కింగ్స్ ఎలెవెన్ పంజాబ్, కోల్‌కతా నైట్ రైడర్స్, ముంబై ఇండియన్స్ జట్ల తరపున ఆడాడు.
ముంబై ఇండియన్స్‌కు ఐదుసార్లు ట్రోఫీ అందించిన కెప్టెన్ రోహిత్ శర్మ ఐపీఎల్‌లో 222 ఇన్నింగ్స్‌లు ఆడాడు. 30.17 సగటు, 129.61 స్ట్రైక్ రేట్‌తో 5879 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, 40 అర్ధ సెంచరీలు ఉన్నాయి. అయితే హిట్‌మ్యాన్ 14 సార్లు డకౌట్ అయ్యాడు.
ఐపీఎల్ చరిత్రలో 13 సార్లు డకౌట్ అయిన ప్లేయర్లు చాలామందే ఉన్నారు. పీయూష్ చావ్లా, హర్భజన్ సింగ్, పార్థీవ్ పటేల్, అజింక్యా రహానే, అంబటి రాయుడు 13 సార్లు పరుగులేమి చేయకుండా ఔట్ అయ్యారు. ఇన్సింగ్స్ పరంగా చూసుకుంటే పీయూష్ చావ్లా 82 ఇన్నింగ్స్‌లో 13సార్లు డకౌట్ అయ్యాడు. చెన్నై సూపర్ కింగ్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్, కోల్‌కతా నైట్ రైడర్స్, ముంబై ఇండియన్స్ జట్లకు ఈ లెగ్ స్పిన్నర్ ప్రాతినిధ్యం వహించాడు.
హర్భజన్ సింగ్ 90 ఇన్నింగ్స్‌ల్లో 13 సార్లు డకౌట్ అయ్యాడు. ఈ వెటరన్ స్పిన్నర్ చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్, ముంబై ఇండియన్స్ జట్ల తరపున ఆడాడు. చివరిసారిగా 2021లో తన చివరి ఐపీఎల్ మ్యాచ్ ఆడాడు.