Khairatabad Ganesh: 70 అడుగుల ఎత్తులో ఖైరతాబాద్ గణపయ్య.. ఈ సారి మరో స్పెషాలిటీ ఏంటో తెలుసా..?
మనదేశంలో వినాయక నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకుంటారు. ఇక హైదరాబాద్ లో గణేష్ ఉత్సవాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఖైరతాబాద్ గణపతుడి వేడుకలు ఘనంగా జరుగుతాయి. ఇక్కడికి ఇరు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా ప్రజలు పెద్ద ఎత్తున వస్తుంటారు.
ఖైరతాబాద్ గణేషుడి కర్రపూజను ఇటీవల పూర్తిచేశారు. స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్, ఉత్సవ కమిటీ సభ్యులు ఈ వేడుకలో పాల్గొన్నారు. ఈసారి 70 అడుగుల ఎత్తులో మట్టి గణనాథుడిని తయారు చేస్తున్నట్లు తెలుస్తోంది. గతేడాది.. 63 అడుగుల ఎత్తులో గణపయ్యను రూపొందించి రికార్డు క్రియేట్ చేశారు.
ఈసారి 70 అడుగుల ఎత్తులో మట్టి గణపయ్యను రూపొందించి,గతేడాది రికార్డును బ్రేక్ చేస్తున్నారు. ఇప్పటికే పనులు కూడా ప్రారంభమయ్యాయి. ఈక్రమంలో ఈసారి ఖైరతాబాద్ వేడుకలకు ఒక ప్రత్యేకత కూడా ఉంది. ఖైరతాబాద్ గణేషుడిని తొలిసారి.. 1954 లో ప్రతిష్టాపన చేశారు.
ఇప్పటి వరకు ఎలాంటి అంతరాయంలేకుండా 70 ఏళ్లను విజయవంతంగా పూర్తి చేశారు. దీనిలో భాగంగానే ఈసారి గణపయ్యను 70 అడుగుల ఎత్తులో మట్టి వినాయకుడిని ప్రతిష్టిస్తున్నట్లు తెలుస్తోంది. అంటే ఈసారి మన గణపయ్య ప్లాటీనం వేడుకలు జరుపుకుంటున్నాడన్నమాట.
ఇదిలా ఉండగా.. ఈసారి సెప్టెంబర్ 7 వినాయక చవితి వచ్చింది. ప్రతి ఏడాది మాదిరిగానే తెలంగాణ గవర్నర్ ఖైరతాబాద్ మహగణపతికి తొలిపూజ కార్యక్రమం నిర్వహిస్తారు. తొలిసారి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కారు కూడా వినాయక చవితి ఏర్పాట్లను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.
కాంగ్రెస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ మాట్లాడుతూ.. హైదరాబాద్ లో గణేషుడి ఉత్సవాలలో ఎలాంటి అసౌకర్యాలకు గురికాకుండా చర్యలు తీసుకొవాలని సీఎం రేవంత్ అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. ముఖ్యంగా రోడ్లపైన గుంతలు పూడ్చడం, విద్యుత్ సరఫరా, మండపాల వద్ద తీసుకొవాల్సిన జాగ్రత్తలను సూచించారు.