Cine Industry: రేవంత్ రెడ్డితో నందమూరి, మెగా ఫ్యామిలీ దూరం? మహేశ్, ప్రభాస్, విజయ్ కూడా!

అల్లు అర్జున్ వ్యవహారం నేపథ్యంలో రేవంత్ రెడ్డి సినీ పరిశ్రమ వారితో నిర్వహించిన సమావేశం చర్చనీయాంశంగా మారింది.

హైదరాబాద్‌లో జరిగిన సమావేశానికి కొంత మంది సినీ ప్రముఖులు మాత్రమే హాజరయ్యారు. నిర్మాతలు, దర్శకులు వదిలేస్తే అగ్ర సినీ నటులు గైర్హాజరు కావడంపై చర్చ జరుగుతోంది.

ఈ సమావేశానికి సినీ పరిశ్రమలో పెద్ద కుటుంబాలైన కొణిదెల, నందమూరి, ఘట్టమనేని కుటుంబాలు రాలేదు. చిరంజీవి, బాలకృష్ణకు ఆహ్వానం పంపినా డుమ్మా కొట్టారని తెలుస్తోంది.
పరిశ్రమలోని మహేశ్ బాబు, ప్రభాస్, విజయ్ దేవరకొండకు ఆహ్వానం దక్కకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఇక మా అధ్యక్షుడిగా ఉన్న మంచు విష్ణుకు కూడా ఆహ్వానం దక్కలేదు. మంచు కుటుంబాన్ని విస్మరించారు. దిగ్గజ నిర్మాత అశ్వనీదత్ కూడా రాలేదు.
పరిశ్రమ నుంచి అక్కినేని నాగార్జున, వెంకటేశ్ మినహా పెద్ద నటులు ఎవరూ కూడా సమావేశానికి రాలేదు. రామ్ పోతినేనికి ఆహ్వానం పంపినా అతడు కూడా సమావేశానికి డుమ్మా కొట్టాడు.
గత ముఖ్యమంత్రి కేసీఆర్‌తో సన్నిహిత సంబంధాలు కొనసాగించిన సినీ ప్రముఖులు రేవంత్ రెడ్డి సమావేశానికి రాకపోవడం చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వమే ఆహ్వానం పంపలేదా? లేదంటే ఆహ్వానం పంపినా సినీ ప్రముఖులు రాలేదా అనే సందేహాలు వస్తున్నాయి. ఏది ఏమైనా ఈ సమావేశం వలన పరిశ్రమకు ఒరిగేదేమీ ఉండదని సినీ పరిశ్రమ వర్గాలు పెదవి విరుస్తున్నాయి.
అల్లు అర్జున్ వివాదం తీవ్ర దుమారం రేపిన నేపథ్యంలో రేవంత్ రెడ్డి పరిశ్రమతో సఖ్యతతో ఉన్నామనే సంకేతాలు పంపేందుకు ఈ సమావేశం నిర్వహించారని సినీ పరిశ్రమలోనూ.. రాజకీయంగానూ చర్చ జరుగుతోంది.