Waqf Board: మోడీ సర్కార్ మరో సంచలన అడుగు.. ఆ చట్టానికి కీలక సవరణలు..
Modi 3.O: కేంద్రంలో నరేంద్ర మోడీ సర్కారు.. మూడోసారి బొటాబొటి మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. గత రెండు ప్రభుత్వాల హయాంలో తీసుకున్న నిర్ణయాలను ఈ సారి తీసుకుంటుందా అనే అనుమానాలను పటాపంచలు చేస్తూ మరో కీలక అడుగు వేసింది. తాజాగా నరేంద్ర మోడీ నేతృత్వంలో సమావేశమైన కేంద్ర క్యాబినేట్.. వక్ఫ్ బోర్డ్ చట్టంలో కీలక సవరణలు చేయడానికి ఆమోదం తెలిపింది.
ఈ సమావేశంలో వక్ఫ్ బోర్డ్ పాలక వర్గంలో కీలక మార్పులు తీసుకురాబోతుంది. అందులో మహిళలకు కూడా స్థానం కల్పించేలా దాంతో పాటు వక్ఫ్ బోర్డ్ ప్రభుత్వానికి జవాబుదారి తనం ఉండేలా ఈ బిల్లులో కీలక మార్పులతో ఈ బిల్లు ఉండనుంది. మొత్తంగా వక్ఫ్ బోర్డ్ చట్టంలో 40 సవరణలను ప్రతిపాదిస్తూ కేంద్ర క్యాబినేట్ ఆమోదం తెలిపింది.
వక్ఫ్ బోర్డ్ ప్రకారం .. ఏదైనా ఆస్తులు వక్ఫ్ తమవని క్లెయిమ్ చేస్తే.. దాన్ని వక్ఫ్ కు సంబంధించిన కోర్టుల్లోనే ఆయా ఆస్తుల యజమానులు తేల్చుకోవాలి. ఈ సందర్బంగా వక్ఫ్ బోర్డ్ కోరలు పీకేలా తాజాగా ఈ చట్టంలో కేంద్రం పలు ప్రతిపాదనలు చేసింది. 1995లో అప్పటి పీవీ నరసింహారావు ప్రభుత్వం వక్ఫ్ బోర్డ్ కు విస్తృత అధికారాలు ఇస్తూ కొత్త వక్ఫ్ చట్టం తీసుకొచ్చింది.
ప్రస్తుతం ఉన్న వక్ఫ్ చట్టం కారణంగా అనేక ప్రభుత్వ, ప్రైవేటు భూములు తమవే అంటూ వక్ఫ్ బోర్డ్ క్లెయిమ్ చేయడం.. అటు వంటి ఆస్తులను ప్రభుత్వం వెనక్కి తీసుకోవడం ఈ చట్టం కారణంగా దుర్లభంగా మారింది. 1954లో అప్పటి ప్రధాన నెహ్రూ ఇక్కడ నుంచి పాకిస్థాన్ కు వెళ్లిన ముస్లిమ్ సమాజం కోసం ఈ వక్ఫ్ చట్టాన్ని తీసుకొచ్చింది.
ముస్లిమ్ వర్గాల కోరిక మేరకే ఈ చట్టంలో కీలక సవరణలకు కేంద్ర నడుం బిగించింది. గతంలో ఆగష్టు 5, 2019లో కేంద్రం జమ్మూ కాశ్మీర్ కు ప్రత్యేక పత్రిపత్తి కల్పిస్తోన్న అతి దుర్మార్గమైన ఆర్టికల్ 370తో పాటు 35 ఏను రద్దు చేసి చరిత్ర సృష్టించింది.
అటు 2020 ఆగష్టు 5న ఎన్నో శతాబ్దాలుగా నలుగుతున్న అయోధ్య రామజన్మభూమికి శంకుస్థాపన చేసారు. ఈ నేపథ్యంలో ఈ సోమవారమే కేంద్ర క్యాబినేట్ ఈ బిల్లును లోక్ సభలో ప్రవేశ పెట్టబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం మన దేశంలో సాయుధ దళాలు, రైల్వేల తర్వాత అతి ఎక్కువ భూములున్నది వక్ఫ్ బోర్డ్ కే కావడం గమనార్హం.
ప్రపంచంలో ఏ ముస్లిమ్ దేశంలో కూడా వక్ఫ్ లాంటి చట్టాలు లేవు. కేవలం ఓటు బ్యాంక్ రాజకీయల కోసమే అప్పట్లో కాంగ్రెస్ సర్కారు.. దీనికి అపరిమిత అధికారాలు కట్టబెట్టిందని హిందూ సంఘాలు చెబుతూ వస్తున్నాయి. మరోవైపు ముస్లిమ్స్ లోని షియా వర్గంతో పాటు మరికొన్ని వర్గాలు కేంద్రం తీసుకురాబోతున్న ఈ కొత్త చట్టంపై హర్షం వ్యక్తం చేస్తున్నాయి.