Nikki Yadav Murder Case: తెల్లవారితే పెళ్లి.. గాళ్‌ఫ్రెండ్‌ వెంటపడుతోందని..

Wed, 15 Feb 2023-8:14 pm,

ఇద్దరం పెళ్లి చేసుకోవాలని నిక్కి యాదవ్ ఒత్తిడి తీసుకురాగా అందుకు సాహిల్ ఇంట్లో పెద్దలు అంగీకరించలేదు. దీంతో తన తల్లిదండ్రులు చూసి కుదిర్చిన సంబందాన్నే పెళ్లి చేసుకునేందుకు సాహిల్ రెడీ అయ్యాడు. ఫిబ్రవరి 10 ముహూర్తం కూడా సెట్ అయ్యింది. కానీ సాహిల్ ఈ విషయాన్ని నిక్కి యాదవ్ వద్ద సీక్రెట్‌గా దాచిపెట్టాడు. ఈ విషయం తెలియని నిక్కి యాదవ్ అతడితో కలిసి గోవాకు వెళ్లేందుకు ట్రిప్ ప్లాన్ చేసింది.

ప్రియుడితో కలిసి గోవా వెళ్లేందుకు ప్లాన్ చేసిన నిక్కి యాదవ్‌కి చివరి నిమిషంలో ఊహించని షాక్ తగిలింది. సాహిల్ తనకు తెలియకుండా ఫిబ్రవరి 10న మరొక యువతిని పెళ్లి చేసుకోబోతున్నాడని అంతకంటే ఒకటి, రెండు రోజుల ముందే నిక్కికి తెలిసింది. ఇదే విషయమై నిక్కీ అతడిని నిలదీసింది. ఈ విషయంలోనే ఇద్దరి మధ్య ఘర్షణ కూడా జరిగింది.

ఇదిలావుండగా.. నిక్కీ తన పెళ్లికి అడ్డంకిగా మారిందని గ్రహించిన సాహిల్.. ఫిబ్రవరి 9న ఆమెను ఢీల్లీలోని కశ్మీరీ గేట్ వద్దకు రావాల్సిందిగా ఫోన్ చేశాడు. సాహిల్ పిలవగానే నిక్కీ అక్కడికి వెళ్లింది. నిక్కీని నిర్మానుష్యమైన ప్రదేశానికి తీసుకెళ్లిన సాహిల్ ఆమెకు ఏదో ఓ విధంగా నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు. కానీ నిక్కీ అందుకు ఒప్పుకోకపోవడంతో తన కారులోని డేటా కేబుల్ తీసి గొంతుకు ఉరేసి ఊపిరాడకుండా చేసి చంపేశాడు. ఆ తరువాత నిక్కీ శవాన్ని తన హ్యూందాయ్ వెర్నా కారులో పడేసి నేరుగా తన దాబాకు వెళ్లాడు. మరునాడే పెళ్లి ఉండటంతో దాబా మూసేసి ఉండటం ఆ క్షణంలో సాహిల్‌కి కలిసొచ్చే అంశంలా కనబడింది. అందుకే నిక్కీ శవాన్ని దాబాలోని ఫ్రిజ్జులో పెట్టి ఇంటికి వెళ్లిపోయాడు. ఇక తనకు అడ్డులేదని భావించిన సాహిల్.. ఆ మరునాడే తన ప్లాన్ ప్రకారం మరొక యువతిని పెళ్లి చేసుకున్నాడు. 

డామిట్.. అలా కథ అడ్డం తిరిగింది... తమ కూతురు నిక్కి యాదవ్‌కి ఫోన్ చేస్తే ఫోన్ స్విఛాఫ్ రావడంతో ఆందోళనకు గురైన ఆమె కుటుంబసభ్యులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిక్కి యాదవ్ తల్లిదండ్రుల ఫిర్యాదుతో మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు... దర్యాప్తులో భాగంగా ఆమె కాల్ హిస్టరీ తీశారు. ఆమె మిస్ అవడానికి కొద్ది ముందుగా సాహిల్ నుంచి ఆమెకు ఫోన్ కాల్ రావడం గమనించిన పోలీసులు అతడిని అరెస్ట్ చేసి నాలుగు తగిలించారు. దీంతో పోలీసుల విచారణలో సాహిల్ తన నేరం అంగీకరించాడు. తానే నిక్కీని చంపి శవాన్ని తన దాబాలోని ఫ్రిజ్‌లో దాచిపెట్టినట్టు పోలీసులకు తెలిపాడు.

సాహిల్ వాంగ్మూలం ప్రకారమే దాబాకు వెళ్లి చూడగా అక్కడి ఫ్రిజ్‌లో నిక్కీ శవం కనిపించింది. గాళ్ ఫ్రెండ్‌కి పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చిన సాహిల్ ఆమెను కాకుండా మరొక యువతితో పెళ్లికి సిద్ధపడి మొదటి తప్పు చేశాడు. ఆ తప్పును కప్పిపుచ్చుకునేందుకు నిక్కి యాదవ్‌ని మర్డర్ చేసి మరొక తప్పు చేశాడు. ఒక తప్పు మరొక తప్పుకు ఎలా దారితీస్తుందో నిక్కి యాదవ్ మర్డర్ కేసు నిరూపించింది. గాళ్ ఫ్రెండ్‌ని చంపి మరొక యువతి మెడలో తాళి కట్టిన సాహిల్.. కటకటాల వెనక్కి వెళ్లి ఆమె జీవితాన్ని అంధకారం చేశాడు.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link