Personal Loans vs Credit Cards: క్రెడిట్ కార్డ్ మంచిదా..పర్సనల్ లోన్ మంచిదా..? రెండింటిలో ఏది బెస్ట్..?
Credit Card vs Personal Loan: రుణం పొందడానికి అనేక రకాల మార్గాలు ఉన్నాయి. ముందుగా వీటిలో మన అందరికీ తెలిసింది బ్యాంకు నుంచి రుణం తీసుకోవడం. అలాగే ప్రైవేటు వడ్డీ రుణాలు తీసుకోవడం. క్రెడిట్ కార్డు ద్వారా రుణాలు పొందడం. ఇలా అనేక రకాలుగా మనం రుణాలు పొందుతాము. అయితే ప్రస్తుతం క్రెడిట్ కార్డు ద్వారా తీసుకునే రుణం మంచిదా? లేక బ్యాంకులో పర్సనల్ రుణం తీసుకోవడం మంచిదా? ఇలాంటి విషయాలను తెలుసుకుందాం.
నిజానికి క్రెడిట్ కార్డు, పర్సనల్ లోన్ రెండు వేటికవే ప్రత్యేకం. అయితే ఈ రెండింటి మధ్య ప్రధాన తేడా ఏమిటంటే క్రెడిట్ కార్డు అనేది మీరు ముందుగా కేటాయించిన మొత్తంలో ఎంత ఖర్చు పెడతారో దానిపై మాత్రమే తిరిగి చెల్లింపులు జరపాల్సి ఉంటుంది. పర్సనల్ లోన్ అలా కాదు. మీరు ఎంత మొత్తం బ్యాంకు నుంచి పొందుతారు ఆ మొత్తం పైన అసలు, వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది.
ఉదాహరణకు మీరు ఒక లక్ష రూపాయల క్రెడిట్ కార్డు పొంది ఉన్నట్లయితే, అందులో మీరు నెలకు ఎంత ఖర్చు పెడతారో కార్డు ద్వారా అంత మొత్తం మాత్రమే బిల్లు రూపంలో మీకు లభిస్తుంది. ఆ బిల్లు చెల్లిస్తే సరిపోతుంది. ఆ బిల్లును ఈఎంఐగా మార్చుకున్నట్లయితే ప్రతి నెల వడ్డీ కూడా చెల్లించాల్సి ఉంటుంది. ఇక పర్సనల్ లోన్ విషయంలో అలా కాదు... మీరు ఎంత లోన్ తీసుకుంటారో, దానిపైన మొత్తం వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది.
ఉదాహరణకు మీరు బ్యాంకు నుంచి ఒక లక్ష రూపాయలు పర్సనల్ లోన్ తీసుకున్నట్లయితే, ప్రతినెల ఈఎంఐ చెల్లించాలి. ఇది ఒక లక్ష రూపాయలు మొత్తం మీద ఉంటుంది. నిర్ణీత కాలంలో దీని పూర్తి చేయాలి. అయితే మీకు పెద్ద స్థాయిలో అవసరాలు ఉన్నట్లయితే పర్సనల్ లోన్ తీసుకోవడం ఉత్తమమైన పని, మీ అర్హతను బట్టి ఎక్కువ మొత్తంలో రుణము లభిస్తుంది.
క్రెడిట్ కార్డు ఈఎంఐ వడ్డీ రేటు తో పోల్చి చూస్తే, పర్సనల్ లోన్ వడ్డీ రేటు తక్కువనే చెప్పవచ్చు. పర్సనల్ లోన్ రుణాలు 13 శాతం నుంచి ప్రారంభం అవుతాయి. సిబిల్ స్కోర్ ను బట్టి మీకు పర్సనల్ లోన్ లభిస్తుంది.
ఇక క్రెడిట్ కార్డుల విషయానికి వస్తే, వీటి ద్వారా షాపింగ్ ఇతర అవసరాలను తీర్చుకోవడానికి స్వల్పకాలిక రుణాలను తీసుకోవచ్చు. కానీ పెద్ద మొత్తంలో రుణాలను తీసుకొని వాటిని ఈఎంఐగా మార్చుకొని తిరిగి చెల్లించడం అనేది అంత తెలివైన నిర్ణయం కాదు.
మీ ఆర్థిక పరిస్థితిని బట్టి క్రెడిట్ కార్డును వాడుకొని ఏ నెల ఆ నెల బిల్లు చెల్లించుకోవడం ఉత్తమమైన పని. అప్పుడే మీరు ఆర్థికంగా నష్టపోకుండా ఉంటారు.