Photos: 95 అడుగుల లోతు Borewellలో పడినా ప్రాణాలతో బయటపడ్డ బాలుడు
బోరుబావులు చిన్నారులకు మృత్యుదారంగా మారిన సందర్భాలు కోకొల్లలు. పలు రాష్ట్రాల్లో బోరుబావిలో పడిన చిన్నారులలో అధికశాతం ప్రాణాలు పోయిన తరువాత వెలికితీసిన సందర్భాలే అధికం. కానీ, తాజాగా ఓ బాలుడు దాదాపు 100 అడుగుల లోతున్న బోరుబావిలో పడిపోయినా, ప్రాణాలతో బయటపడ్డాడు. మృత్యుంజయుడుగా తిరిగొచ్చి తల్లిదండ్రుల కళ్లల్లో వెలుగులు నింపాడు.
రాజస్థాన్‌లోని జలోర్ జిల్లాలో నాలుగేళ్ల బాలుడు అనిల్ బోరుబావిలో పడిపోయాడు. జిల్లాలోని సంచోర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల ఓ గ్రామంలో ఆడుకుంటూ ప్రమాదవశాత్తూ గురువారం సాయంత్రం అనిల్ 95 అడుగుల లోతున్న బోరుబావిలో పడ్డాడు. (ANI Twitter Photo)
తండ్రి నగర్ దేవాసీతో కలిసి తమ పొలానికి వెళ్లిన అనిల్ అనే బాలుడు నీళ్లు పడకపోవడంతో పూడ్చకుండా వదిలివేసిన బోరుబావిలో పడటంతో ఆందోళన మొదలైంది. ఈ వారమే బోరుబావి వేయించామని, దానిపై ఉంచిన మూత పక్కకు జరిపి ఆడుకుంటూ తన కుమారుడు అందులో పడిపోయాడని ఆవేదన వ్యక్తం చేశాడు. (ANI Twitter Photo)
తన కుమారుడు బోరుబావిలో పడిపోయాడని పోలీసులకు అనిల్ తండ్రి సమాచారం అందించాడు. అజ్మీర్‌తో పాటు గుజరాత్ నుంచి సహాయక సిబ్బందిని అక్కడికి చేరుకుని సహాయక చర్యలు ముమ్మరం చేశారు. 16 గంటల పాటు పడిన శ్రమకు శుక్రవారం ఉదయం ఫలితం దక్కింది. (ANI Twitter Photo)
బోరుబావిలోకి వైర్ల ద్వారా కొన్ని సెన్సార్లు పంపిన రెస్క్యూ సిబ్బంది మొదటగా చిన్నారి అనిల్‌ను ధైర్యంగా ఉండమని చెప్పారు. తగినంత ఆక్సిజన్ అందేలా ఏర్పాట్లు చేశారు. ధైర్యం చెబుతూనే మరోవైపు సహాయక చర్యలు కొనసాగించారు. యుద్ధప్రాతిపదికన పక్కనే సమాంతరంగా మరో గొయ్యి సైతం తవ్వారు. (ANI Twitter Photo)
చిన్నారికి నీరు, ఆహారాన్ని ఎప్పటికప్పుడూ బోరుబావిలోకి పంపారు. అనిల్ అవి తింటూ, నీళ్లు తాగుతూ ఉండటాన్ని వీరు సెన్సార్ల సాయంతో తమ వద్ద ఉన్న పరికరంలో వీక్షించారు. కొన్ని వైర్ల సాయంతో చిన్నారిని వీడియోలో గమనిస్తూ జాగ్రత్తగా పైకి లాగారు. ఆపై తక్షణ వైద్యం కోసం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. (ANI Twitter Photo)
మృత్యుంజయుడైన నాలుగేళ్ల బాలుడు అనిల్ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని వైద్యులు చెప్పడంతో రెస్క్యూ సిబ్బంది, అధికారులు, తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. కానీ దాదాపు 100 అడుగుల లోతున్న బోరుబావిలో పడిపోయిన చిన్నారిని ప్రాణాలతో రక్షించిన రెస్క్యూ సిబ్బంది, అధికారులను స్థానికులు, నేతలు ప్రశంసించారు. (ANI Twitter Photo)