BA Raju Birth Anniversary: జర్నలిస్ట్ నుంచి నిర్మాతగా బీఏ రాజు ప్రస్థానం ఎందరికో ఆదర్శం..

Mon, 06 Jan 2025-3:45 pm,

BA Raju Birth Anniversary:  దివంగత సూపర్ స్టార్ కృష్ణ వద్ద పబ్లిసిటీ వ్యవహారాలను చూసే  పిఆర్ఓగా కెరీర్ స్టార్ట్ చేశారు  బిఏరాజు. ఆ తరువాత ఆయన ప్రోత్సహంతోనే సినీ పాత్రికేయుడిగా తన ప్రస్థానం మొదలుపెట్టి అందులో రాణించారు. ఆంధ్రజ్యోతి, జ్యోతి చిత్ర, ఉదయం, శివరంజని, వంటి దిన, సినీవార పత్రికలలో వివిధ హోదాలలో పనిచేసారు బీఏ రాజు.

ఆ తర్వాత తన సతీమణి బి జయ సహచర్యంతో 1994 లో సూపర్ హిట్ వార పత్రిక స్థాపించారు. అంతేకాదు స్థాపించిన కొన్ని రోజుల్లోనే  తెలుగు సినీ వార్తాపత్రికలలో ఇదో సంచలనం అని చెప్పాలి. అప్పట్లో పెద్ద సినీ వార పత్రికలు కూడా వెనకబడి పోయాయి. ఆయన  కన్నుమూసేంత వరకు  ఒక్క సంచిక మిస్సవకుండా  27 యేళ్ల పాటు ఆ పత్రికను దిగ్విజయంగా నిర్వహించారు అంటే ఆయన అకుంఠిత దీక్ష ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.

కేవలం సినీ జర్నలిస్టుగానే కాకుండా  టాప్ డైరెక్టర్స్ కు.. కథానాయకులకు, కథానాయికలకు మార్గ దర్శనం ఇస్తూ వారి సినీ కెరీర్ కి పెద్ద గైడ్ గా  నిలిచారు రాజు. సుమారు 1500 చిత్రాలకు పైగా పబ్లిసిటీ ఇంఛార్జిగా పని చేసిన బిఏ రాజు ఆయా చిత్రాల సక్సెస్ లో ఆయన పాత్ర మరవలేనిది. చిత్ర పరిశ్రమలో చిన్నా పెద్దా అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరితో ఆత్మీయ అనుబంధాన్ని ఏర్పర్చుకుని అజాత శత్రువుగా పేరు తెచ్చుకున్నారు బి.ఏ.రాజు. తెలుగు సినీ రంగం హైదరాబాద్ బదిలీ కావడంతో 2001 లో సూపర్ హిట్ అడ్మిస్ట్రేషన్ ఆఫీస్ కూడా హైదరాబాద్ కు షిఫ్ట్ చేశారు.

అదే ఇయర్ ఆయన  నిర్మాతగా, ఆయన భార్య బి జయ దర్శకురాలిగా 'ప్రేమలో పావని కళ్యాణ్' అనే చిత్రంతో ఆర్జే సినిమాస్ బ్యానర్ మీద సినీ నిర్మాణ రంగంలో ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత  చంటిగాడు, ప్రేమికులు, గుండమ్మ గారి మనవడు, సవాల్, లవ్లీ, వైశాఖం వంటి సక్సెస్ ఫుల్  చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు అందించారు. రాజు గారు ప్రారంభించిన ఇండస్ట్రీ హిట్ వెబ్ సైట్ ద్వారా, దాదాపు 7 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు.  ఎంతో పాపులర్ అయిన ఆయన (ట్విట్టర్) ఎక్స్ అకౌంట్ ద్వారా పరిశ్రమకు సంబంధించిన వార్తా విశేషాలు ఎప్పటికప్పుడు ఆయన బృందం, BA Raju's Team ద్వారా అందిస్తున్నారు. ఆర్ జే సినిమాస్ ద్వారా ఆయన తనయుడు శివకుమార్ బి కూడా నిర్మాతగా త్వరలో ప్రముఖ హీరోలతో చిత్రాలను ప్రకటించనున్నారు.

చిత్ర పరిశ్రమ ప్రముఖులందరితో అత్యంత  సన్నిహిత సంబంధాలు ఉన్నప్పటికీ... ముఖ్యంగా ఎవర్ గ్రీన్ సూపర్ స్టార్ కృష్ణ, సూపర్ స్టార్ మహేష్ బాబులతో బీఏ రాజుకు  మంచి అనుబంధం ఉండేది.  అలాగే ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ అధ్యక్షులుగా పనిచేశారు. సినీ పాత్రికేయులకు ఏ కష్టం వచ్చినా నేనున్నానంటూ ముందుండే వారు.

అంతేకాదు ఆర్ధిక, హార్దిక భరోసా ఇచ్చేవారు. ఏ డైరెక్టర్ ఏ  హీరోతో ఎన్ని సినిమాలు నిర్మించాడో? బ్యానర్ పేరు, విడుదల తేదీ ఆ మూవీ ఎన్ని రోజు ఈ సెంటర్లలో ఆడిందో వంటి వివరాలను తడుముకోకుండా హ్యూమన్ టాలీవుడ్ ఎన్సైక్లోపీడియాలా టక్కున చెప్పడం ఆయన స్పెషాలిటీ.అంతటి సినిమా పరిజ్ఞానాన్ని సొంతం చేసుకున్న బీఏ రాజు... 24 గంటలు సినిమా గురించే ఆలోచించేవారు. ఆయన  మన నుండి దూరమై ఏళ్లు గడుస్తున్నా ఆయన అందిస్తున్న సేవలు అజరామరం. ఏ లోకాన వున్నా ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని 65వ జయంతి సందర్భంగా నివాళులు అర్పిస్తోంది జీ న్యూస్.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link