Snake bite: రోజుకు ఒకర్ని కాటేసి చంపేస్తున్న పాము..?.. రెండు దశాబ్దాల తర్వాత మరల హడల్..
పాములంటే మనలో ప్రతి ఒక్కరు చచ్చేంత భయంతో ఉంటారు. పొరపాటున పాము కనిపించిందంటే ఆ ప్రదేశం దరిదాపుల్లోకి కూడా అస్సలు వెళ్లరు. కొందరు పాములు కన్పిస్తే స్నేక్ సొసైటీ వారికి సమాచారం ఇస్తారు. పాములకు ఆపద కల్గించకూడదని చెబుతుంటారు.
బంగ్లాదేశ్ లో ఇటీవల పాము కాట్లు ఎక్కువగా అయ్యాయని వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా రస్సెల్స్ వైపర్ వల్ల ఎక్కువగా పాము కాటులు జరిగినట్లు తెలుస్తోంది. ఈ పాము 2002లో బంగ్లాదేశ్ నుండి అదృశ్యమైంది.. కానీ ఇటీవల కాలంలో దీని కాటుకు ప్రతిరోజూ ఒకరు బలి అవుతున్నట్లు సమాచారం.
రెండు దశాబ్దాల క్రితం, ఈ విషసర్పం బంగ్లాదేశ్‌లో అంతరించిపోయినట్లు ప్రకటించారు. కానీ ఇటీవల కాలంలో మరల రస్సెల్స్ వైపర్ పాము ఎక్కువగా దేశంలో కన్పిస్తున్నట్లు సమాచారం. బంగ్లాదేశ్‌లోని అన్ని ఆసుపత్రులు, ఆరోగ్య కేంద్రాలలో యాంటీ-వెనమ్ ఉంచాలని ఆదేశాలు జారీ అయ్యాయి.
రస్సెల్స్ వైపర్ భారత ఉపఖండంలోని అత్యంత విషపూరితమైన పాములలో ఒకటిగా పరిగణించబడుతుంది. రస్సెల్స్ వైపర్ ప్రధానంగా దక్షిణాసియాలో కనిపిస్తుంది. బంగ్లాదేశ్ ఈ జాతిని 2002లో 'అంతరించిపోయిందని' ప్రకటించింది. కానీ ఇప్పుడు మరల పాములు కన్పిస్తున్నాయి. శాస్త్రవేత్తల ప్రకారం, పొడి ప్రాంతాల్లో కనిపించే రస్సెల్స్ వైపర్ వివిధ పరిస్థితులకు అనుగుణంగా ఉంటుంది.
ఇటీవలి కాలంలో, బంగ్లాదేశ్‌లో పాము కాటు కారణంగా మరణాల సంఘటనలు వేగంగా పెరుగుతున్నాయి. సామాజిక మాధ్యమాల్లోనూ పాము కాటుకు గురైన ఘటనలు చర్చనీయాంశమవుతున్నాయి. పాము కాటుకు సంబంధించిన అనేక కేసులు, ముఖ్యంగా రస్సెల్స్ వైపర్, గ్రామీణ ప్రాంతాల్లో నమోదవుతున్నాయి. BBC నివేదిక 2023 అధ్యయనం ప్రకారం బంగ్లాదేశ్‌లో ప్రతి సంవత్సరం సుమారు 7,000 మంది పాము కాటుతో మరణిస్తున్నట్లు తెలుస్తోంది.
యాంటీ-వెనమ్ అందుబాటులో ఉంటే పాము కాటు నుంచి బైటపడోచ్చు. రస్సెల్ యొక్క వైపర్ ఎలుకలను తినడానికి ఇష్టపడుతుంది, కాబట్టి, ఇది తరచుగా మానవ నివాస ప్రాంతాల చుట్టూ కనిపిస్తుంది. పంట కాలంలో పొలాల్లో దీని వ్యాప్తి పెరుగుతుంది. పాము కాటు బాధితులను వీలైనంత త్వరగా ఆసుపత్రికి తరలించాలని బంగ్లాదేశ్ ఆరోగ్య మంత్రి డాక్టర్ సమంత్ లాల్ సేన్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
భారతదేశంలోని నాలుగు ప్రధాన విషపూరిత పాములలో రస్సెల్స్ వైపర్ ఒకటిగా పరిగణించబడుతుంది. పాము కాటుకు సంబంధించిన చాలా సందర్భాలలో రస్సెల్స్ వైపర్, క్రైట్, కోబ్రా, సా-స్కేల్డ్ వైపర్ నుండి వస్తాయి. కేవలం ఒక కాటుతో, రస్సెల్ వైపర్ ఒక వ్యక్తికి మరణాన్ని కలిగించేంత విషాన్ని విడుదల చేస్తుంది.
రస్సెల్ యొక్క వైపర్ కాటు యొక్క ప్రధాన లక్షణాలు చిగుళ్ళలో రక్తస్రావం, ఆగకుండా మూత్రం విసర్జన చేస్తుంటారు. తక్షణమే చికిత్స చేయకపోతే, కాటు వేసిన కొన్ని గంటల వ్యవధిలోనే.. మూత్రపిండ, శ్వాసకోశ లేదా గుండె వైఫల్యం కారణంగా మరణం సంభవించవచ్చని నిపుణులు చెబుతున్నారు.