Sravana masam 2024 Weddings: శ్రావణ మాసం అంతా పెళ్లిళ్ల సీజన్..ఈ నెల రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో ఎంత బిజినెస్ జరుగుతుందో తెలుసా..?
Sravana masam Functions: రేపటి నుంచి (ఆగస్టు 5, 2024) శ్రావణమాసం ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున వివాహాలు జరగనున్నాయి. భారతదేశంలో ఏటా 1 కోటి వివాహాలు జరుగుతాయని ఒక సర్వేలో తేలింది. వీటి ద్వారా దాదాపు రూ. 10 లక్షల కోట్ల వ్యాపారం జరుగుతుందని కూడా ఓ నివేదికలో తేలింది. అందులో ఎక్కువ శాతం శ్రావణమాసంలోనే జరుగుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.
శ్రావణమాసంలో దాదాపు చాలా ఎక్కువ రోజులు వివాహ ముహూర్తాలు ఉంటాయి. దీంతో ఫంక్షన్ హాల్స్, బాంక్వెట్ హాల్స్. కల్యాణ మండపాలు అదేవిధంగా ఇతర కమ్యూనిటీ హాల్స్ వంటివి రెండు నెలల ముందే బుకింగ్స్ అయిపోతాయి. సాధారణంగా పెద్ద నగరాల్లో గార్డెన్స్ లో వివాహం జరుపుకోవాలంటే ఒక రోజుకు కనీసం రూ. 2 లక్షల నుంచి రూ. 15 లక్షల వరకూ చార్జ్ చేస్తుంటారు. ఈ లెక్కన శ్రావణ మాసంలో గార్డెన్స్ ఓనర్లకు కనీసం రూ. 50 లక్షల నుంచి రూ. 1 కోటి వరకూ ఆదాయం వచ్చే అవకాశం ఉంది. ఇక ఫంక్షన్ హాల్స్ సైతం సుమారు రూ. 50 వేల నుంచి రూ. 5 లక్షల వరకూ చార్జ్ చేస్తారు.
పెళ్లి వేడుకలకు ముఖ్యమైనది వివాహ దుస్తుల షాపింగ్. శ్రావణమాసం సందర్భంగా అనేక వస్త్ర దుకాణాలు ఆఫర్లను ప్రకటిస్తాయి. ముఖ్యంగా పెళ్లిళ్ల సీజన్ కావడంతో ఈ మాసంలో అత్యధిక శాతం బిజినెస్ జరుగుతుందని వస్త్ర దుకాణాల వ్యాపారులు చెబుతున్నారు. ఈ సంవత్సరం కూడా పెద్ద ఎత్తున తమ బిజినెస్ అయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా తెలంగాణలోని హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, నిజామాబాద్, మహబూబ్ నగర్ వంటి నగరాల్లో పెద్ద ఎత్తున షోరూములకు పెళ్లిళ్ల షాపింగ్ కోసం జనాలు తరలి వస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ లోని ప్రధాన నగరాలైన విజయవాడ, విశాఖపట్నం, రాజమండ్రి, తిరుపతి, కర్నూలు, కడప, కాకినాడ, అనంతపురం, నెల్లూరు, ఒంగోలు, గుంటూరు వంటి నగరాల్లో కూడా ప్రముఖ షాపింగ్ మాల్స్ అదేవిధంగా వస్త్ర దుకాణాలన్నీ కూడా పెళ్లిళ్ల షాపింగ్ కోసం ఇసకేస్తే రాలనంత జనంతో కిక్కిరిసిపోతున్నాయి. ఈ సీజన్ లో సుమారు రూ. 3000 కోట్ల వస్త్ర వ్యాపారం సాగుతుందని వాణిజ్య వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇక వస్త్ర వ్యాపారం తర్వాత అత్యధికంగా సేల్స్ పొందే వ్యాపారం నగల వ్యాపారం. ఈ నెలలో తెలుగు రాష్ట్రాల్లో అన్ని నగల వ్యాపార సముదాయాలు బిజీగా ఉంటాయి.
ఇక క్యాటరింగ్ సర్వీసుల వారికి కూడా ఈ సీజన్ చాలా పెద్ద సీజన్ అని చెప్పాలి. ముఖ్యంగా కిరాణా సామాన్లు వారికి కూడా ఈ మాసంలో పెద్ద ఎత్తున బిజినెస్ సాగుతుంది. ఇక వివాహానికి అనుబంధంగా ఉండే డెకరేషన్ ఫ్లవర్ బిజినెస్, వీడియో గ్రాఫర్లు, ఫోటోగ్రాఫర్లు, బ్యూటీషియన్లు, మెహందీ డిజైనర్లు వాటి బిజినెస్ లు ఎక్కువగా సాగుతాయి. వెరసి తెలుగు రాష్ట్రాల్లో వివాహ బిజినెస్ ఈ మాసంలో దాదాపు రూ. 25 వేల కోట్లపైనే సాగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.