Game Changer Ticket rate hikes on Telangana:‘గేమ్ ఛేంజర్’ కోసం మాట తప్పిన రేవంత్ రెడ్డి.. టిక్కెట్ రేట్స్, అదనపు షోలకు అనుమతి..
Game Changer Ticket rate hikes on Telangana: పుష్ప 2 సందర్భంగా ఇకపై తాను ముఖ్యమంత్రిగా ఉన్నంత వరకు టికెట్ రేట్స్ పెంచుకునేందుకు అనుమతులు ఇవ్వనని చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. తనకు అత్యంత సన్నిహితుడు తెలంగాణ ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ చైర్మన్ గా ఏరికొరి నియమించిన దిల్ రాజు కోసం పట్టు సడలించారు.
సినిమా బడ్జెట్ తో పాటు అన్ని అంశాలను పరిశీలించిన తర్వాత రేవంత్ సర్కార్.. శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన ‘గేమ్ చేంజర్’ సినిమాకు అయిన బడ్జెట్ కారణంగా ఈ సినిమాకు తెలంగాణలో ఉదయం బెనిఫిట్ షోతో పాటు అదనపు ఆటలతో కలిపి ఐదు షోలకు పర్మిషన్ ఇచ్చింది.
మొదటి రోజు మల్టీప్లెక్స్ లో రూ. 150 + GST, సింగిల్ స్క్రీన్ లో రూ. 100 + GST పెంచుకునేందుకు అనుమతులు ఇచ్చింది. అటు సినిమా రెండో రోజు 11 జనవరి నుంచి 19వ తేది వరకు మల్టీప్లెక్స్ లో రూ. 100, సింగిల్ స్క్రీన్ లో 50 అదనపు ఛార్జీల పెంపుకు అనుమతులు ఇచ్చింది. ఈ సినిమాను ఐమాక్స్ ఫార్మాట్ లో రిలీజ్ చేస్తున్నారు.
దీంతో తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్ మహా నగరంలో మొదటి రోజు రూ. 480, సింగిల్ స్క్రీన్స్ లో రూ. 250 నుంచి రూ. 275 మధ్య టికెట్ రేట్ ఉండనుంది. ఆ తర్వాత రూ. 430, సింగిల్ స్క్రీన్స్ లో 225 నుంచి రూ. 245 వరకు ఉండే అవకాశాలున్నాయి. రూరల్ ఏరియాలతో పాటు సీ సెంటర్స్ లో సినిమా థియేటర్ బట్టి ఈ రేట్లు మారే అవకాశాలున్నాయి.
గేమ్ చేంజర్ విషయానికొస్తే.. ఈ సినిమాలో రామ్ చరణ్ తొలిసారి తండ్రీ కొడుకులుగా ద్విపాత్రాభినయం చేస్తున్నట్టు తెలుస్తుంది. అందులో నాలుగు వేరియేషన్స్ కనిపిస్తున్నాయి. ఐఏఎస్, ఐపీఎస్, రైతు, రాజకీయ ఉద్యమ కారుడి పాత్రలో కనిపించబోతున్నారు.
ఇక శంకర్ ఇప్పటి వరకు తమిళం, హిందీ సినిమాలను మాత్రమే డైరెక్ట్ చేశారు. తొలిసారి రామ్ చరణ్ తో తెలుగులో డైరెక్ట్ ఎంట్రీ ఇస్తున్నాడు.
అటు రామ్ చరణ్ .. దక్షిణాది ప్యాన్ ఇండియా డైరెక్టర్స్ అయిన రాజమౌళి, శంకర్ ఇద్దరు డైరెక్షన్ లో నటించిన హీరోగా రికార్డు క్రియేట్ చేసారు. మరోవైపు ఎన్టీఆర్, చిరంజీవిలతో చేసిన ఆర్ఆర్ఆర్, ఆచార్య సినిమాల తర్వాత వస్తోన్న చిత్రం కావడంతో ఈ సినిమాపై భారీ ఆశలే ఉన్నాయి.