Rythu Bharosa: రైతులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్.. ఈ నెల నుంచి రైతు భరోసా..
Rythu Bharosa: తెలంగాణ రైతులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఎప్పటి మాదిరిగానే ఒక ఎకరా నుంచి మొదలుపెట్టి.. ఐదు ఎకరాలు ఉన్న రైతులకు డిసెంబర్ నెలఖారు వరకు రైతుల ఖాతాలకు నిధులను జమ పూర్తిచేయాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. వాస్తవానికి దసరా తర్వాత నుంచే రైతు భరోసా పంపిణీ చేయాలని తొలుత ప్రభుత్వం భావించింది.
కానీ, అప్పటికే రుణమాఫీ కోసం రూ.18 వేల కోట్లు రైతులకు ప్రభుత్వం రిలీజ్ చేసింది. దీంతోపాటు మరికొన్ని స్కీములకు నిధులు సర్దుబాటు చేయాల్సి వచ్చిందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. దసరా నుంచి అనుకున్న రైతు భరోసాను ఈ నెలాఖరు నుంచి మొదలుపెట్టాలనే నిర్ణయం తీసుకుంది.
దీని కోసం నిధులను సర్దుబాటు చేయాలని ఆర్థిక శాఖను సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించినట్లు తెలిసింది.రైతుల విషయంలో ప్రతిపక్షాలకు అవకాశం ఇవ్వబోమన్నారు. డిసెంబర్ నెలలో స్థానిక ఎన్నికల కంటే ముందే రైతుల ఖాతాల్లో పెట్టుబడి సాయం జమ చేయాలన్నారు.
ప్రతి 10 రోజులకు రూ.1,500 కోట్ల నుంచి రూ. 2 వేల కోట్ల చొప్పున జమ చేసేలా 45 రోజుల్లో కనీసం రూ.7 వేల కోట్లు జమ చేసేలా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నది. దీంతో ఇప్పుడున్న లెక్కల ప్రకారం.. ఏడెనిమిది ఎకరాల రైతులకు అంటే దాదాపు 96 శాతం మందికి రైతుభరోసా అందుతుంది. రైతుబంధు స్కీమ్‌లో భారీగా నిధులు దుర్వినియోగం అవుతున్నాయని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. గత సర్కార్ హయాంలో.. రాళ్లు, రప్పల భూములు, గుట్టలు, హైవేలు, రోడ్లు, వెంచర్లు, భూసేకరణ కింద పోయిన భూములకు వేల కోట్ల రూపాయలు రైతుభరోసా కింద వృథాగా చెల్లించినట్లు తేలింి.
2018 నుంచి 2023 వరకు రాళ్లు రప్పలు, రోడ్లకు ఇతరత్రా వాటికి ఏకంగా రూ.25 వేల కోట్లు చెల్లించినట్లు గుర్తించింది. దీంతో రైతు భరోసాకు సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసి..ఎన్ని ఎకరాల వరకు ఇవ్వాలనే దానిపై జిల్లాల్లో సభలు నిర్వహించి అభిప్రాయ సేకరణ చేసింది. చాలామంది రైతులు 10 ఎకరాల వరకు పెట్టుబడి సాయం ఇస్తే సరిపోతుందని తెలిపారు. మరికొంతమంది రైతులు ఏడున్నర ఎకరాల వరకు ఇవ్వాలని సూచించారు. అందరి అభిప్రాయాలు తీసుకున్న కేబినెట్ సబ్ కమిటీ ఇప్పటికే లిమిట్ ఎంతవరకు పెట్టాలనే దానిపై మార్గదర్శకాలకు సంబంధించిన డ్రాప్ట్ నోట్‌ను రెడీ చేసింది. ఈ మార్గదర్శకాలపై త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డితో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చర్చించనున్నట్లు సమాచారం.
రైతులు, రైతు సంఘాలు, వివిధ పార్టీల అభిప్రాయాలు ఇప్పటికే తెలుసుకున్నందున.. అవసరమైతేనే అసెంబ్లీలో చర్చించాలని ప్రభుత్వం భావిస్తున్నది. అసెంబ్లీ సమావేశాలను కూడా ఈ నెల మొదటి వారంలో నిర్వహించాలని అనుకున్నప్పటికీ శాసనమండలి చైర్మన్, అసెంబ్లీ స్పీకర్ విదేశీ పర్యటనలో ఉండటంతో వారు తిరిగిరాగానే అసెంబ్లీ సమావేశాలపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. దానికి తగ్గట్టు రైతు భరోసా మార్గదర్శకాలపై చర్చించే అవకాశం ఉంది.
ఎప్పటిలాగే ఎకరా నుంచి పెట్టుబడి సాయాన్ని జమ చేయాలని ప్రభుత్వం భావిస్తున్నది. అట్ల 45 రోజుల్లో రైతు భరోసాను పూర్తి చేయాలనుకుంటున్నది. ప్రతి వారం, పది రోజులకు ఒకసారి ఏక మొత్తంలో రూ.1,500 కోట్ల నుంచి 2 వేల కోట్లు జమ చేయాలని ఆలోచిస్తున్నది. దీంతో నిధుల సర్దుబాటు కూడా ఈజీ అవుతుందని భావిస్తున్నది. స్థానిక ఎన్నికల కంటే ముందే పెట్టుబడి సాయం కూడా కంప్లీట్ చేయాలని చూస్తున్నది. ఇదిలా ఉంటే, వ్యవసాయేతర భూములకు ఎట్టిపరిస్థితుల్లోనూ రైతుభరోసా ఇవ్వొద్దని ప్రభుత్వం డిసైడ్ అయ్యారు.
వ్యవసాయ భూముల్లో వెంచర్లు చేసి ప్లాట్లుగా మార్చిన వాటికి నాలా కిందనే పరిగణించనున్నారు. రోడ్లు, ఇరిగేషన్, ఇండ్లు ఇతరత్రా వ్యవసాయేతర భూములకు మళ్లిన వాటిని రైతు భరోసా లిస్ట్‌లో నుంచి తీసేయాలని నిర్ణయించారు. దీంతో చాలా వరకు నిధుల దుర్వినియోగం తగ్గుతుందని ప్రభుత్వం భావిస్తున్నది. రాష్ట్ర వ్యవసాయ శాఖ సాగు లెక్కల ప్రకారం 1.39 కోట్ల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. దుబారాను కట్టడి చేస్తే.. పెట్టుబడి సాయం కోసం దాదాపు 7వేల కోట్లు అవసరమవుతాయని అధికారులు అంచనా వేశారు