Tirumala: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. ఆ 10 రోజులు వారికి నో ఎంట్రీ..!

తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల రద్దీ పెరిగింది. క్రిస్మస్ సెలవులు స్కూళ్లు, కాలేజీలకు వచ్చాయి. ఇది కాకుండా కొత్త సంవత్సరం అతి దగ్గరలోనే ఉంది. ఏడాది చివరి మాసం కావడంతో డిసెంబర్‌లో ట్రిప్పులు వేసేవారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటుంది.

ఈనేపథ్యంలో ఆధ్యాత్మిక ప్రయాణం చేసేవారు కూడా ఎక్కువగానే ఉంటారు. కాబట్టి ముందుగా శ్రీవారి దర్శనం చేసుకోవడానికి చాలామంది భక్తులు ఉత్సాహం చూపిస్తారు. అయితే, ప్రస్తుతం తిరుమల దర్శనానికి 20 గంటల సమయం పడుతుంది.

బుధవారం డిసెంబర్ 25వ తేదీ సెలవు దినం కావడంతో తిరుమలలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. దాదాపు 73 వేల మందికి పైగా భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి హుండి ఆదాయం రూ.4 కోట్లుకు పైగా సమకూరిందని సమాచారం.
తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించిన దాదాపు 1.20 లక్షల టోకెన్లు భక్తులకు అందజేస్తామని టీటీడీ ఈఓ శ్యామలరావు చెప్పారు. జనవరి 10,11,12 తేదీల్లో దర్శనం చేసుకోవడానికి 9వ తేదీ ఉదయం 5 గంటల నుంచి అందజేస్తామన్నారు.
ఇందులో సామాన్యులకు అధిక ప్రాధాన్యత ఉండనున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాతి తేదీలకు సంబంధించిన టోకెన్లు మాత్రం ఒక రోజు ముందుగా జారీ చేస్తామని చెప్పారు. అయితే, టోకెన్లు లేనివారికి మాత్రం ఈ వైకుంఠ ఏకాదశి పదిరోజులు అనుమతి లేదని చెప్పారు.
వైకుంఠ ఏకాదశి జనవరి 10వ తేదీన నిర్వహించనున్నారు. 2025 జనవరి 10 నుంచి 19వ తేదీ వైకుంఠ ఏకాదశి ప్రత్యేకంగా ఉత్తర ద్వార దర్శనం భక్తులకు కల్పించనున్నారు. భక్తులు తప్పనిసరిగా టోకెన్లు కలిగి ఉండాలి.