Turkey-Syria Earthquake Pics: భారీ భూకంపంలో విషాదగాథలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న ఫొటోలు
శిథిలాల కింద ఓ అక్కాతమ్ముడు చిక్కుకుపోయారు. ఏడేళ్ల బాలిక బాలిక తాను బండరాయి కింద నలిగిపోతున్నా.. తమ్ముడికి ఏమీ కాకూడదని పోరాడింది. ఏకధాటిగా 17 గంటల పాటు తన తమ్ముడి తలకు చెయ్యి అడ్డుగా పెట్టి కాపాడింది. ప్రస్తుతం ఈ పిక్ నెట్టింట వైరల్ అవుతోంది. వారిద్దరినీ సురక్షితంగా రెస్క్యూ సిబ్బంది కాపాడారు.
తన తమ్ముడిని కాపాడేందుకు ఆ బాలిక చేసిన సాహాసంపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ ఫొటో సిరియాలోని హరామ్ నగరానికి సమీపంలో ఉన్న బెస్నాయా-బాసినేహ్ నుంచి బయటకు వచ్చింది.
సిరియాలోనే శిథిలాల నుంచి నవజాత శిశువు ప్రాణాలతో బయటపడింది. భూకంపం సంభవించిన సమయంలోనే మహిళ ప్రసవించింది. శిథిలాల కింద చిక్కుకుపోయి అందరూ చనిపోగా.. పసికందు మాత్రం సురక్షితంగా బయటపడింది. చిన్నారి తన తల్లి బొడ్డు తాడుతో అలానే ఉంది. సైనికులు శిథిలాలు తొలగిస్తున్న సమయంలో పసికందు ఏడుపు వినిపించింది. వెంటనే కాపాడి ఆసుపత్రికి తరలించారు.
భూకంపం కారణంగా సిరియాలోని ఒక కోట, ప్రసిద్ధ శర్వాన్ మసీదు కూడా ధ్వంసమయ్యాయి. రోమన్ కాలంలో నిర్మించిన గాజియాంటెప్ కోట దేశంలోనే అత్యుత్తమ స్థితిలో ఉందని చెబుతారు.
మరోవైపు మొత్తం 20 వేల మంది వరకు మరణించవచ్చని డబ్యూహెచ్ఓ అధికారులు అంచనా వేస్తున్నారు. సోమవారం తెల్లవారుజామున 4 గంటలకు టర్కీ, సిరియాలో దేశాలలో 7.8 తీవ్రతతో భూకంపం వచ్చిన విషయం తెలిసిందే. భూకంపం కారణంగా దాదాపు 11 వేల భవనాలు ధ్వంసమయ్యాయి. 50 వేల మందికిపైగా గాయపడ్డారు.