సినిమా షూటింగ్ కాదు.. బెజవాడలో పెళ్లిసందడి
పెళ్లి అనేది జీవితంలో కీలక ఘట్టం. అందుకే ఆధునిక కాలంలో ఒక్కొక్కరు ఒక్కోలా తమ పెళ్లి సెలబ్రేషన్ నిర్వహిస్తున్నారు. ప్రతి ఒక్కరు తాము చేసే కార్యక్రమంలో ఎదో ఒక ప్రత్యేకత చూపాలనుకుంటున్నారు. కొందరు పెళ్లికి ముందు ప్రి వెడ్డింగ్ ఫొటో, వీడియో షూట్ చేసి మధుర అనుభూతులను దాచుకుంటున్నారు. ఈ క్రమంలో విజయవాడలో జరిగిన ఓ వివాహం సినిమా సీన్లను తలపించేలా జరిగింది.
పురాణాల్లో దేవతలు తిరిగే పుష్పక విమానం తరహాలో ఓ రూపొందించారు. నూతన వధూవరులను అందులో ఎక్కించి మిరుమిట్లు గొలిపే కాంతులు ప్రదర్శిస్తూ ఆకాశంలో తిప్పారు. ఇది చూసేవారు ఇదేదో విఠలాచార్య సినిమా లాంటి షూటింగ్ అనుకున్నారు. అలా అనుకున్నవారు పప్పులో కాలేసినట్లే. కృష్ణా జిల్లాలో పెళ్లి వేడుకను ఇలా ఘనంగా నిర్వహించారు.
విజయవాడ నగరంలోని పాతబస్తీకి చెందిన వ్యాపారి నంబూరు నారాయణరావు అనే వ్యాపారి ఇంట్లో పెళ్లి సందడి ఇలా జరిగింది. వ్యాపారి తన కుమారుడు సందీప్ వివాహ రిసెప్షన్ ఏప్లస్ ఫంక్షన్ హాల్‌లో నిర్వహించారు. నూతన వధూవరులు సందీప్, సౌర్యలు పుష్పక విమానం లాంటి ఓ పక్షి తరహాలో రూపొందించిన ఆకారంలో గాల్లో విహరిస్తూ గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చారు.
భారీ క్రేన్ సాయంతో 100 అడుగుల ఎత్తులో ఉంచి పుష్పక విమానంలాంటి ఆకారంలో కొత్త జంటను లేజర్ లైట్లు ప్రదర్శిస్తూ ఫంక్షన్ హాల్‌కు తీసుకొచ్చారు. ఈ సమయంలో అక్కడ ఉన్నవారంతా తమ ఫోన్లకు పని చెప్పారు. ఫొటోలు, వీడియోలు తీసి షేర్ చేస్తున్నారు. అయితే ఇది తెలియని వారు ఇదేదో సినిమా షూటింగ్ అనుకునేలా ఈవెంట్ నిర్వహించారు. వివాహ రిసెప్షన్‌కు వచ్చిన అతిథులు సైతం ఆశ్చర్యానికి లోనయ్యారు.
బెజవాడనా పెళ్లి మజాకానా అంటూ స్థానికులు చెబుతున్నారు. మొత్తానికి పెళ్లిళ్లు కొత్తపుంతలు తొక్కుతున్నాయని, బెజవాడలో పుష్పక విమానం అంటూ స్థానికులు ఈ ఫొటోలు వైరల్ చేస్తున్నారు.