Weather Update: తెలంగాణలో నిన్నటి నుంచి భిన్న వాతావరణం, ఈ జాగ్రత్తలు తప్పనిసరి..
ఆంధ్రప్రదేశ్‌కు తుఫాను ముప్పు తప్పింది. అయితే, అల్పపీడనం తీరం దాటే క్రమంలో కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. మరికొన్ని ప్రాంతాల్లో చెదురుముదురు వర్షాలు పడతాయి.
అయితే, తెలంగాణలో మాత్రం వాతావరణం భిన్నంగా మారుతోంది. రాత్రి నుంచి ముసురు వేసింది. ఇప్పటికే పెరిగిన చలిగాలులు, పొగమంచుకు ఈ ముసురు తోడైంది. ఇప్పటికే పగటిపూట 25 డిగ్రీలు రికార్డు అవుతోంది.
మంగళవారం నుంచి కాస్త టెంపరేచర్ పెరిగింది అనుకున్నారు. ఈ లోగా నిన్నటి నుంచి మళ్లీ పలు జిల్లాల్లో ముసురేస్తోంది. దీంతో టెంపరేచర్ మరింత పడిపోయింది. హైదరాబాద్‌లో నిన్న ఉదయం నుంచే చిరుజల్లులు కురవడం ప్రారంభమైంది.
రాత్రంతా కూడా ఈ చిరుజల్లులు కురిశాయి. ముఖ్యంగా ములుగు, వరంగల్, మహబూబాబాద్ జిల్లాల్లో కూడా అకాల వర్షాలు కురుస్తున్నాయి. వాతావరణం పూర్తిగా చల్లగా మారిపోయింది. డిసెంబర్ చివరి వారంలో ఇలా వర్షాలు పడుగూ ఒకింత ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. ఇప్పటికే వాహనదారులు కూడా పలు జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు.
ఉదయం లేదా రాత్రి సమయంలో వాహనదారులు కచ్చితంగా లైట్లు వేసుకుని వెళ్లాలని లేకపోతే ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించిన సంగతి తెలిసిందే. అంతేకాదు ఈ చలిగాలుల నేపథ్యంలో వృద్ధులు చంటి పిల్లల ఆరోగ్యంపై జాగ్రత్త వహించాలని సూచించింది.
ఇప్పటికే తెలంగాణలో సీజనల్ జబ్బులు వేధిస్తున్నాయి. జ్వరం, జలుబు, దగ్గుతో బాధపడుతున్నారు. కేవలం కాచి చల్లార్చిన నీటిని మాత్రమే తాగాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఆహారం కూడా వేడివేడిగా తీసుకోవాలి. బయటకు వెళ్లినప్పుడు మఫ్లర్, స్వెటర్లు వంటివి ధరించాలి.