WhatsApp Delays New Privacy Policy: ప్రైవసీ పాలసీపై వెనక్కి తగ్గిన వాట్సాప్
కొత్త ప్రైవసీ విధానంపై ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ వెనుకంజ వేసింది. తమ వ్యక్తిగత సమాచారాన్ని మాతృసంస్థ ఫేస్‌బుక్‌కు అందిస్తుందని ప్రపంచ దేశాల నుంచి.. ముఖ్యంగా భారతీయ నెటిజన్ల నుంచి వస్తున్న తీవ్ర విమర్శలు, ఆరోపణల నేపథ్యంలో వాట్సాప్(WhatsApp) కీలక నిర్ణయం తీసుకుంది. తమ కొత్త ప్రైవసీ విధానాన్ని మే 15వ తేదీ వరకు వాయిదా వేసినట్లు ప్రకటించింది.
ఇటీవల ప్రకటించిన విధంగా ఫిబ్రవరి 8వ తేదీన ఎవరి వాట్సాప్ అకౌంట్‌నూ సస్పెండ్ చేయడం/ తొలగించడం జరగవు అని వాట్సాప్ సంస్థ ప్రకటించింది. ప్రస్తుతం వాట్సాప్ వినియోగదారులలో తలెత్తిన గోప్యతా, భద్రతా పరమైన అంశాలపై అపోహలను తొలగించేందుకు కొంత సమయం పట్టనుందని అభిప్రాయపడింది.
Also Read: WhatsApp: ప్రైవసీ పాలసీ నచ్చలేదా.. మీ వాట్సాప్ అకౌంట్ ఇలా డిలీట్ చేసుకోండి
తమ వినియోగదారుల వ్యక్తిగత వివరాలు, డేటా ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్షన్‌లో ఉంటుందని వాట్సాప్ పేర్కొంది. ఈ సమాచారానికి తాము సాంకేతికంగా భద్రతా కల్పిస్తామని, వీటిని వాట్సాప్‌గానీ, ఫేస్‌బుక్ గానీ చదవలేదని స్పష్టం చేసింది.
తమ కస్టమర్ల లోకేషన్‌ను ఎవరికీ వెల్లడించే అవకాశం లేదని చెప్పింది. వాట్సాప్ ఛాటింగ్ వివరాలు, వీడియో, ఆడియో కాలింగ్ సమాచారాన్ని రికార్డు చేయడం లేదని వివరించింది. వీటిపై అపోహలు తొలగించి, మే 15వ తేదీ నుంచి కొత్త ప్రైవసీ పాలసీని అందుబాటులోకి తెస్తామని బ్లాగ్ పోస్ట్‌లో వాట్సాప్ వెల్లడించింది.
Also Read: WhatsApp Features: మీ వాట్సాప్‌లో మెస్సెజ్‌లు కుప్పలుతెప్పలుగా వస్తున్నాయా.. ఇలా చేస్తే సరి!
తమ వ్యక్తిగత సమాచారానికి భద్రత లేకుండా పోతుందని భావించిన వాట్సాప్ వినియోగదారులు వాట్సాప్ అకౌంట్‌ను డిలీట్ చేసుకుంటున్నారు. గత కొన్ని రోజులుగా వాట్సాప్‌నకు ప్రత్యామ్నాయంగా సిగ్నల్, టెలిగ్రామ్ వంటి ఇతర మెస్సేజింగ్ యాప్‌లను భారీ సంఖ్యలో స్మార్ట్‌ఫోన్ యూజర్లు డౌన్‌లోడ్ చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో వాట్సాప్ కాస్త వెనక్కి తగ్గింది.