6 Years Old Kid's Daily Time Table: ఒకసారి మీరు మీ బాల్యంలోకి వెళ్లి రండి అని ఎవరైనా చెబితే మీరు ఆలోచిస్తారా ? ఆలోచించరు కదా.. ఎందుకంటే బాల్యం అంటే ఇష్టపడని వాళ్లు ఎవరు ఉంటారు చెప్పండి. ఏ బాదర, బంధీ లేని కాలమే మన బాల్యం. పెరిగి పెద్దయ్యాకా కొత్తగా వచ్చిన డెడ్ లైన్స్, కుటుంబ బాధ్యతలు, ఆర్థిక వ్యవహారాలు, సంసారం, ఖర్చులు, ఫీజులు, పేమెంట్స్ ... జీవితం మొత్తంలో ఇలా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇష్టం వచ్చినట్టుగా లైఫ్ ఎంజాయ్ చేసే రోజులు ఏవైనా ఉన్నాయా అంటే అది మన బాల్యమే కదా. అందుకే బాల్యం అంటే ఇష్టపడని వాళ్లుండరు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయినా ఇప్పుడు ఇదంతా ఎందుకు చెబుతున్నట్టు అని అనుకుంటున్నారా ? మరేం లేదండి.. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక పోస్ట్ చూస్తే మీకు కూడా మీ బాల్యం గుర్తుకొచ్చి తీరుతుంది. బాల్యం గుర్తుకొచ్చేంతగా ఆ పోస్టులో ఏముంది అని అనుకుంటున్నారా ? ఒక ఆరేళ్ల పిల్లాడు తను పొద్దున 9 గంటలకు నిద్ర లేచింది మొదలు మళ్లీ రాత్రి 9 గంటలకు పడుకునే వరకు రోజు మొత్తంలో ఏయే సమయంలో ఏమేం చేయాలి అని వివరంగా ఒక టైమ్ టేబుల్ రాసి పెట్టుకున్నాడు. ఆ టైమ్ టేబుల్ ని ఆ పిల్లాడి కజిన్ ట్విటర్ లో షేర్ చేయగా.. ప్రస్తుతం ఆ పోస్ట్ వైరల్ గా మారింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆ పోస్టును చూసిన నెటిజెన్స్.. ఆ టైమ్ టేబుల్ తో పాటు తమ బాల్య స్మృతులను కూడా గుర్తుచేసుకుంటున్నారు.


ఈ ఆరేళ్ల బుడతడి క్రియేటివిటీ ఎలాంటిదంటే.. టైమ్ టేబుల్ కూడా చాలా క్రియేటివ్ గా డిజైన్ చేసుకున్నాడు. ఫైటింగ్ టైమ్ అంటూ మధ్యాహ్నం 11.30 గంటల నుంచి 2.30 గంటల వరకు ఒక స్లాట్ రాసిపెట్టుకున్నాడు. చిన్న పిల్లలు తమ ఈడు పిల్లలతో సరదాగా కొట్టుకోవడం సర్వ సాధారణం. ఇంట్లో ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది చిన్న పిల్లలు ఉంటే.. వారిలో ఎవరో ఒకరు ఎప్పుడూ దెబ్బలాడుకోవడం చూస్తుంటాం కదా .. ఇది కూడా అలాంటిదే.. 


ఉదయం 9 గంటలకు వేకప్ టైమ్, వాష్ రూమ్ టైమ్ 9 గంటల నుంచి 9. 30 గంటల వరకు, 10 నుంచి 10.30 గంటల వరకు బ్రేక్ ఫాస్ట్ టైమ్, 10 నుంచి 11 గంటల వరకు టీవీ టైమ్, 11 గంటల నుంచి పదకొండున్న వరకు క్వాద్రి సాబ్ టైమ్, ఆ తరువాత 11.30 గంటల నుంచి రెండున్నర వరకు ఫైటింగ్ టైమ్, ఆ తరువాత 2.30 గంటల నుంచి 2.45 గంటల వరకు స్టడీ టైమ్ అంటూ రాసుకొచ్చాడు. ఫైటింగ్ టైమ్ కోసం 3 గంటల సమయం కేటాయించిన ఈ చిచ్చరపిడుగు.. చదువుకోవడం కోసం మాత్రం కేవలం 15 నిమిషాలే కేటాయించాడు. ట్విటర్‌లో ఈ టైమ్ టేబుల్ ఫోటోను షేర్ చేసుకున్న లైబా అనే ట్విటర్ యూజర్ కూడా ఇదే విషయాన్ని హైలైటే చేయడం మనం చూడొచ్చు. 


మొత్తానికి ఈ పోస్ట్ సోషల్ మీడియాలో ఫుల్ హైలైట్ అవుతోంది. ఈ టైమ్ టేబుల్ చూసిన వాళ్లంతా తమ బాల్యాన్ని గుర్తుచేసుకుంటున్నారు. మొత్తం షెడ్యూల్లో ఎక్కడా స్కూల్ టైమింగ్స్ లేకపోవడం.. అందులోనూ ఉదయం ఆలస్యంగా 9 గంటలకు నిద్ర లేవడం అని రాసి ఉండటం చూస్తే.. సమ్మర్ హాలీడేస్ కోసమే ఈ బుడతడు ఈ టైమ్ టేబుల్ ప్రిపేర్ చేసుకుని ఉండొచ్చు అని అర్థం అవుతోంది.