Dead Rat Found In Food: ఆకలితో ఉండగా వచ్చిన హోటల్ ఫుడ్.. ఫుడ్ పార్సిల్లో చచ్చిపోయిన ఎలుక
Dead Rat Found In Food: ధర్నాలో ఎలాటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా శాంతి భద్రతలు కాపాడే పనిలో విధులు నిర్వర్తిస్తున్న పోలీసులకు అల్పాహారం తెప్పించగా.. అందులో ఇలా చనిపోయిన ఎలుక బయటపడింది. ఈ విషయాన్ని విధుల్లో ఉన్న పోలీసులు తమ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు.
Dead Rat Found In Food: బెంగళూరు: ఎవరైనా బాగా ఆకలితో ఉన్నప్పుడు కళ్ల ముందు ఆహారం వస్తే వెంటనే ఆవురావురుమని తినేస్తుంటారు. ఆ సమయంలో క్షణం ఆలస్యమైనా ఇక తట్టుకోవడం కష్టమే అన్నట్టుగా ఉంటుంది విపరీతంగా ఆకలితో ఉన్న వారి పరిస్థితి. అలా ఆకలితో ఉండి కళ్ల ముందుకు వచ్చిన ఆహారాన్ని తింటుండగానే అందులో ఒక చనిపోయిన ఎలుక కనిపిస్తే అప్పుడు వారి పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోండి. సరిగ్గా విధుల్లో ఉన్న కర్ణాటక పోలీసులకు ఇలాంటి దుస్థితే ఎదురైంది.
తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల మధ్య ఏళ్ల తరబడిగా కావేరి నది జలాల కోసం పోరాటాలు, దీక్షలు, బంద్ లు జరుగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా బెంగళూరులో కావేరి జలాల వివాదంపై రైతులు మరోసారి బంద్‌కి పిలుపునిచ్చిన నేపథ్యంలో అక్కడ నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో బెంగళూరులో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా కర్ణాటక సర్కారు భారీ సంఖ్యలో పోలీసులను మోహరించి భద్రతా చర్యలు చేపట్టింది.
కావేరి జలాల కోసం జరుగుతున్న నిరసన కార్యక్రమాల వద్ద పోలీసులు నిద్రాహారాలు మానేసి విధుల్లో ఉండి శాంతి భద్రతలు కాపాడే పనిలో పడ్డారు. కాగా తాజాగా వారికి అందించిన అల్పాహారంలో చనిపోయిన ఎలుక రావడం కనిపించింది. పోలీసులకు ఎక్కడికక్కడ వారికి సమీపంలో ఉన్న హోటల్స్ నుంచి ఉదయం అల్పాహారం తెప్పించారు. అందులో భాగంగానే ఒక చోట విధులు నిర్వర్తిస్తున్న పోలీసులకు అల్పాహారం తెప్పించగా.. అందులో ఇలా చనిపోయిన ఎలుక బయటపడింది. ఈ విషయాన్ని విధుల్లో ఉన్న పోలీసులు తమ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి వారికి ఫిర్యాదు చేయగా.. ట్రాఫిక్ పోలీస్ జాయింట్ కమిషనర్ అనుచేత్ ఈ ఘటనకు సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడించారు.
పోలీసు సిబ్బందికి ఆహారం సరఫరా చేసిన ప్రైవేట్ హోటల్ కి నోటీసులు జారీచేసి వారిపై తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా ట్రాఫిక్ పోలీస్ జాయింట్ కమిషనర్ అనుచేత్ బెంగళూరులోని యశ్వంత్‌పూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ట్రాఫిక్ పోలీస్ జాయింట్ కమిషనర్ అనుచేత్ ఫిర్యాదుతో యశ్వంతపూర్ పోలీసులు హోటల్ యాజమాన్యానికి నోటీసులు జారీ చేసి దర్యాప్తు చేపట్టారు.