దయాశంకర్ మిశ్రా, డిజిటల్ ఎడిటర్, జీ న్యూస్ హిందీ


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నీకు మంచి ఉద్యోగం వచ్చింది. అయినా అంత ఆనందంగా కనిపించడంలేదు. ఇంత చిన్న వయస్సులోనే అంత పెద్ద ఇంటికి యజమాని అయ్యావు. అయినా సంతోషంగా లేవు. నీకు నచ్చిన, నువ్వు కోరుకున్న అమ్మాయినే భార్యగా తెచ్చుకున్నా నీ ముఖంలో ఆ సంతృప్తి కనబడటం లేదు. ఇలాంటి పరిస్థితులన్నింటిలోనూ అలా ఆనందంగా కనిపించని వ్యక్తులను ఎవరినైనా కదిలిస్తే, వారి నుంచి వచ్చే సమాధానం ఒక్కటే. "అరెరె.. ఈమాత్రానికే ఏం అయిందని ఆనందంగా ఉండమంటావు ? ఇల్లు అయితే తీసుకున్నాను కానీ నెల నెలా ఈఎంఐ టెన్షన్ వేధిస్తోంది. నచ్చిన అమ్మాయినే పెళ్లి చేసుకున్నాను. అయినా ఏదో ఆనందం కొరవడింది" అనే సమాధానాలే వినిపిస్తాయి.


ఇదెక్కడి న్యాయం ? ఎప్పుడైతే మనం అన్నీ తెలిసి, మన పరిస్థితి ఏంటో అర్థం చేసుకుని నిర్ణయాలు తీసుకున్నామో.. అటువంటప్పుడు ఆ తర్వాత జరిగే పరిణామాలకు ఇంకొకరిని ఎలా బాధ్యులను చేస్తాం ? కొత్త ఉద్యోగం వచ్చింది కదా అనే సంతోషం కూడా మనకు ఎక్కువ కాలం నిలవదు. ఎందుకంటే, ఆ మరుసటి రోజు నుంచే మనల్ని మన పక్కింటోళ్లతోనో, ఎదురింటోళ్లతోనో పోల్చుకుని జీవితంపై అంచనాలు పెంచేసుకుంటాం. కొత్త ఉద్యోగం వస్తే, అందులోని మజాను ఆస్వాదించాల్సిందిపోయి, అక్కడి నుంచి ఇంకేదో అందుకోవాలని పరితపిస్తుంటాం. అంతేకాకుండా అదే సమయంలో మన మిత్రులకు ఇంకెవరికైనా మంచి ఉద్యోగం వచ్చినట్టయితే, మన ఫోకస్ అంతా ఉన్నట్టుండి వాళ్లపైకి మళ్లుతుంది. మనకు కూడా అలాంటి ఉద్యోగం ఇంకేదైనా వస్తే మరింత బాగుండేది కదా అనే ఆలోచనలతోనే మన ఆనందాన్ని ఆవిరయ్యేలా చేసుకుంటాం.


ఇవాళ రేపు ఇటువంటి పరిస్థితే ఇళ్లు కొనుక్కుంటున్న వారిలోనూ కనిపిస్తోంది. మొదట ఇల్లు కొన్నప్పుడు అదో రకమైన పాజిటివ్ ఎనర్జీ కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. కానీ ఆ తర్వాతే ఆర్థిక ఇబ్బందులను చూసి ఆ ఆనందం కాస్తా ఆవిరైపోతుంది. అయితే, ఇక్కడ ముఖ్యంగా గ్రహించాల్సింది ఏంటంటే.. ఇప్పుడు ఎదురయ్యే ఆర్థిక ఇబ్బందులు ఏవీ కొత్తగా తెలియకుండా వచ్చిపడ్డవి కాదు. గతంలో పరిస్థితి ఎలా వుందో ఇప్పుడూ అలాగే వుంది అనే విషయం అర్థం చేసుకోవాలి. కాకపోతే ఇల్లు కొనడానికి ముందున్న మనశ్శాంతి ఆ తర్వాత ఎదురయ్యే ఆర్థిక ఇబ్బందుల కారణంగా వుండకపోవచ్చు. అయితే, ఆర్థిక ఇబ్బందులు ఎలా ఉంటేనేం కానీ మనం ఓ సొంత ఇల్లు నిలబెట్టుకున్నాం కదా అని అనుకోకపోతే మనశ్శాంతి అనేది ఉండదు.  


జీవితంలో ఎప్పుడైనా ఒక స్థాయికి చేరుకున్నాకా.. అక్కడుండే అనుభూతిని ఆస్వాదించాలి కానీ ఆ ప్రయత్నం చేయకుండానే మరో స్థాయికి వెళ్లాలని తాపత్రయపడితే ఇక జీవితంలోని అసలు మజాను ఎప్పుడు ఆస్వాదిస్తారు ? ఒక్క మాటలో చెప్పాలంటే, జీవితంలో ఆనందం అనేదానిని మనం ఎప్పుడో అందనంత ఎత్తులో పెట్టేశాం. దీనివెనుకున్న అసలు మూల కారణం వేరే ఉంది. మనిషి ఎప్పుడూ అందని ద్రాక్ష కోసం తాపత్రయపడుతూ కళ్లముందున్న ఆనందాన్ని అనుభవించకుండా దుఖిస్తూ గడపడానికే ఎక్కువ ఇష్టపడటమే అందుకు ప్రధాన కారణం. ఎంత వున్నా ఇంకేదో కావాలనే అంతు లేని కోరికలు, పక్కింటోళ్లతో పోలికలు, భారీ భారీ అంచనాలే మనిషికి బద్ధ శత్రువులు. కానీ ఆ బద్ధ శత్రువులతోనే మనిషి సావాసం చేస్తున్నాడు. 


దురాశ అనేది ఓ పద్మవ్యూహం లాంటిది. అందులో చిక్కుకుంటే బయటికి రావడం కష్టం అనే విషయాన్ని మనిషి గ్రహించలేకపోతున్నాడు. వైద్య పరిభాషలో చెప్పాలంటే అది ఓ రకమైన సిండ్రోమ్ లాంటిదే. అలాగే మీకు తెలిసిన వాళ్లు ఎవరైనా సంతోషంగా కనిపిస్తున్నారు అంటే వాళ్లు తమకు ఉన్నదాంట్లోనే సంతోషాన్ని వెదుక్కుంటున్నారు అనే సంగతిని మరువకూడదు. 


సరిగ్గా మనిషి కోరికలకు కూడా ఇదే సూత్రం వర్తిస్తుంది. ఎదుటి వాళ్లు తమ మాట వింటే బాగుంటుంది అనే చోట మొదలయ్యే కోరికకు ఎక్కడ అంతం ఉంటుందో తెలీదు. అది నెరవేరనప్పుడు అవతలి వాళ్లపై ఓ రకమైన అసహనం, కోపం కట్టలు తెంచుకోవడం జరుగుతుంది. ఎవరికైనా వారి వెన్నంటే ఉండే కుటుంబసభ్యులు, పిల్లలు, స్నేహితులే వారి ప్రపంచం. తాను చెప్పే ప్రతీ మాట వాళ్లు వినాలనుకోవడం ఓ కోరిక. అది నెరవేరనప్పుడు వచ్చేదే కోపం. వీటన్నింటి మధ్య ఇంకెక్కడుంటుంది సుఖం ? 


ఆనందానికి అతి పెద్ద శత్రువు ఏదైనా వుందా అంటే.. అది దురాశే. ఇంకొంచెం కావాలి అనే దురాశకు అడ్డూఅదుపు లేదు. ఎంతున్నా... ఇంకొంచెం ఉంటే బాగుండు అనే దురాశ ఎప్పుడూ మనిషి మెదడుని తొలిచేస్తుంటుంది. "ఇంకొంచెం" అనే దురాశకు అంతం పలికితే ఆనందం దానంతట అదే వస్తుంది. ఎందుకంటే ఆనందం, మనశ్శాంతి అనేవి ఎక్కడో లేవు.. మీ మనసులోనే వున్నాయని తెలుసుకోండి. 


తాజా కథనంపై మీ విలువైన సూచనలు, సలహాలు ఇవ్వగలరు: