గూగుల్ కృత్రిమ మేథస్సుతో ఆస్పత్రిలో రోగి ఎప్పుడు చనిపోతారో అంచనా !
ప్రముఖ సాంకేతిక దిగ్గజం గూగుల్ అభివృద్ధి చేసిన కృత్రిమ మేథస్సు ఇకపై కేవలం మానవరహిత కార్లకే పరిమితం కాకుండా.. త్వరలోనే ఆస్పత్రుల్లో రోగులు ఎప్పుడు చనిపోనున్నారో కూడా అంచనా వేయనుందట! బ్లూమ్‌బర్గ్ ప్రచురించిన ఓ కథనం ప్రకారం గూగుల్ ఉపయోగిస్తున్న ఓ సరికొత్త రకమైన అల్గారిథం ఆస్పత్రుల్లో రోగులను కబలించే మృత్యువును సైతం అంచనా వేయనుందని తెలుస్తోంది. చివరి స్టేజ్‌లో ఛాతి క్యాన్సర్‌తో బాధపడుతున్న ఓ మహిళ కేసును ఉదాహరణగా ప్రస్తావిస్తూ, ఆమె ఆస్పత్రిలో చేరి, అక్కడ చికిత్స పొందినంత కాలంలో ఆమె చనిపోయే అవకాశాలు 9.3% ఉన్నట్టుగా ఆస్పత్రి వర్గాలు అంచనా వేశాయి. అయితే, అదే సమయంలో గూగుల్ కృత్రిమ మేథస్సు మాత్రం 19.9% ఆమె మృత్యువుకు చేరువయ్యే అవకాశాలున్నట్టుగా స్పష్టంచేసిందని ఆ కథనం పేర్కొంది. గూగుల్ కృత్రిమ మేథస్సు అంచనా వేసినట్టుగానే ఆమె వెంటనే తుదిశ్వాస విడవడంతో గూగుల్ కృత్రిమ మేథస్సు అంచనాల్లో కొంత కచ్చితత్వం ఉందనే వాదనలకు బలం చేకూరినట్టయింది. అన్నింటికిమించి ఆమె అనారోగ్యాన్ని అంచనా వేయడానికి గూగుల్ కృత్రిమ మేథస్సు అధ్యయనం చేసిన అంశాలు పరిశోధకులను ఔరా అని ముక్కున వేలేసుకునేలా చేశాయి.
ప్రస్తుతం మోర్స్ కోడ్ ఇన్‌పుట్ అనే పరిజ్ఞానంతో ఈ గూగుల్ కృత్రిమ మేథస్సు ప్రత్యేక సామర్థ్యం కలిగిన వారికోసం ప్రత్యేక సేవలందిస్తోంది. ఈ మోర్స్ కోడ్ ఇన్‌పుట్ ఆధారంగా ప్రత్యేక సామర్థ్యం కలిగిన వారు ఒకరితో మరొకరు సంభాషించుకోవడానికి, రాయడానికి, చదవడానికి సైతం వీలు కలిగేలా గూగుల్ కృత్రిమ మేథస్సు పనిచేస్తోంది.